ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారంలో మినీ జాతరకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నాలుగోతేదీ వరకూ జరిగే మినీ వన జాతరను సైతం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో సమ్మక్క, సారలమ్మ వన జాతర ఘనంగా జరుగుతుంది. మధ్యలో ఏడాది మినీజాతర పేరిట గద్దెలను శుద్ధి చేస్తారు. రెండేళ్లకోసారి జరిగే ప్రధాన జాతరకు ఇతర ప్రాంతాలనుంచి కూడా భక్తులు వస్తారు. మినీ జాతరకు మాత్రం కేవలం మేడారం చుట్టుపక్కల గిరిజనులు మాత్రమే వస్తారు. కానీ కాలక్రమంలో మినీ జాతరకు కూడా భారీగా పోటెత్తుతున్నారు భక్త జనులు. దీంతో ఈ మినీ జాతరను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే ఇక్కడకు భారీగా తరలి వచ్చారు భక్తులు. మొత్తం ముప్పై లక్షల మంది వరకూ వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో మినీ జాతరకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగ నిర్వహించనున్నారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ, గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అనే పేరుకూడా ప్రసిద్ధి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి