మకర సంక్రాంతి అనేది భారతదేశంలో హిందువులు జరుపుకునే ఒక ప్రధాన పండుగ. ప్రతి సంవత్సరం సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు. కనుక ఈ మకర సంక్రాంతి పండగ ప్రతి ఏడాది జనవరి 14న లేదా జనవరి 15న వస్తుంది. మకర సంక్రాంతిని పంట పండుగ అని కూడా పిలుస్తారు. కొత్త పంట ఇంటికి చేరుకుంటుంది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం ఉత్సాహం నెలకొంటుంది. సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నమైన మకర సంక్రాంతి పండగ కొత్త ఏడాదిలో ఎప్పుడు.. పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? గంగాస్నానం చేసి దానం చేయడానికి శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం.
వేద క్యాలెండర్ ప్రకారం మకర సంక్రాంతిని 2025 జనవరి 14 మంగళవారం జరుపుకోవాలి. ఈ రోజు ఉదయం 9.03 గంటలకు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక మకర సంక్రాంతి పండగను జనవరి 14 జరుపుకోవాలి. అదే సమయంలో భోగి పండగ జనవరి 13 వ తేదీన, కనుమ పండగను జనవరి 15న జరుపుకోవాలని తెలుస్తోంది.
వేద పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగను 14 జనవరి 2025న మాత్రమే జరుపుకోవాలి. ఈ రోజున ఉదయం 9.03 గంటల నుంచి సాయంత్రం 05.46 గంటల వరకు శుభ సమయం. కనుక ఈ సమయంలో గంగాస్నానం చేసి దానం చేయడం శుభప్రదం. ఈ శుభ సమయంలో గంగాస్నానం చేయడం , దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పవిత్ర సమయం 8 గంటల 42 నిమిషాలు ఉండనుంది. మకర సంక్రాంతి మహా పుణ్యకాల సమయం ఉదయం 9.03 గంటల నుంచి 10.48 గంటల వరకు ఉంటుంది. ఈ పవిత్ర కాలం 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు కాలాల్లోనూ గంగాస్నానం చేయడం, దానం చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
మకర సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. స్నానం చేసే నీటిలో గంగాజలం లేదా తులసి దళాలను జోడించుకోవాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించాలి. రాగి పాత్రలో నీటిని నింపి.. అందులో కుంకుమ, అక్షతలు, నువ్వులు, ఎర్ర పువ్వులు కలిపి ఆ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తరువాత సూర్య భగవానుడి మంత్రాలను జపించండి. పూజ చేసే సమయంలో ఎరుపు పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం (నువ్వులు లడ్డులు, బెల్లం) మొదలైన వాటిని ఉపయోగించాలి. మకర సంక్రాంతి రోజున దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున సూర్య భగవానుని పూజించడం వల్ల వ్యాధుల నుంచి ఉపశమనం లభించి.. ఆరోగ్యంగా ఉంటారు.
మకర సంక్రాంతి రోజున ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత రోజులో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం తగ్గుముఖం పట్టడం మొదలవుతుందని నమ్ముతారు. ఈ పండుగ కొత్త పంటల రాకను కూడా సూచిస్తుంది. ఈ రోజున రైతులు తమ కొత్త పంటలను ఇంటికి తీసుకుని తెచ్చుకుంటారు. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణం కాలం మొదలవుతుంది. అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి పయనించడం మొదలు పెడతాడు. ఇది సానుకూల శక్తి, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. మకర సంక్రాంతి రోజున గంగా, యమునా తదితర ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే దానాలకు, పూజలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.