Maha Shivaratri: కోటప్పకొండలో మొదలైన ప్రభల సందడి.. తిరునాళ్ళకు బయలు దేరిన కాకాని ప్రభ

|

Mar 07, 2024 | 7:07 AM

మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలు, శైవ క్షేత్రాల్లో సందడి మొదలైంది. పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ల ప్రభల సందడి మొదలైంది. కాకాని ప్రభ పూజలు చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. డెబ్భై అడుగుల ఎత్తుతో నిర్మాణం చేసి విద్యుత్ బల్బులు అమర్చి ప్రభలను కొండ తరలివెళ్తుంటారు భక్తులు.

Maha Shivaratri: కోటప్పకొండలో మొదలైన ప్రభల సందడి.. తిరునాళ్ళకు బయలు దేరిన కాకాని ప్రభ
Kotappakonda Tirunallu
Follow us on

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లకు శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి ఆలయం ముస్తాబు అయింది.  మహా శివరాత్రి సందర్భంగా రేపటి నుంచి కోటప్పకొండ తిరునాళ్లు ప్రారంభం కానున్నాయి. కోటప్పకొండ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. త్రాగునీరు, పార్కింగ్, శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో.. కోటప్పకొండ మహా శివరాత్రి తిరునాళ్ళకు సంబంధించి ప్రభల హడావుడి మొదలైంది. రేపటి నుంచి తిరునాళ్లు ప్రారంభం కానుండడంతో కాకాని గ్రామంలో ప్రభకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత.. ప్రభ ట్రాక్టర్‌ను నడిపి సందడి చేశారు. ఈ సందర్భంగా.. హరహర మహదేవ, శివనామస్మరణలతో మారుమోగింది కాకాని ప్రభల ప్రాంగణం. శివనామస్మరణతో చేదుకో కోటయ్య నినాదాలతో కోటప్పకొండకు వెళ్లింది కాకాని ప్రభ.

కోటప్పకొండలో మహాశివరాత్రి ప్రభలకు ఎంతో ప్రత్యేకత ఉంది‌. ఎక్కడా లేని విధంగా కోటప్పకొండలో విద్యుత్ ప్రభలు కొలువుదీరుతాయి‌. డెబ్భై అడుగుల ఎత్తుతో నిర్మాణం చేసి విద్యుత్ బల్బులు అమర్చి ప్రభలను కొండ తరలివెళ్తుంటారు భక్తులు. తమ గ్రామాలు పచ్చని పాడిపంటలతో తల తూగాలంటే కోటప్పకొండకు ప్రభ కట్టుకొని వెళ్ళాలని ప్రజలు భావిస్తారు. అంతేకాదు.. కోరిన కోర్కే తీర్చితే ప్రభ కట్టుకొని కొండకు వస్తామని మ్రొక్కుకుంటారు. గత 70 ఏళ్ళ నుండి క్రమం తప్పకుండా కొన్ని గ్రామాలు ప్రభలతో కొండకు తరలివెళ్తుంటాయి‌. ఈ ప్రభలపై ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ భక్తులు జాగారం పూర్తి చేస్తారు. కోటప్పకొండ కోటి వేల్పుల అండ అని భావించే భక్తులు రేపటి నుంచి ప్రారంభమయ్యే తిరునాళ్ళకు రెడీ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..