
మన ఇళ్లలో బల్లులు కనిపించడం చాలా సాధారణ విషయం. అయితే చాలామంది వీటిని కేవలం ఒక జంతువులా చూసి విస్మరిస్తారు. కానీ శకున , జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం.. ఇంట్లో బల్లి కనిపించే దిశ, దాని రంగు, అది చేసే శబ్దం మన భవిష్యత్తులో జరగబోయే శుభ, అశుభ పరిణామాలకు సంకేతాలని మీకు తెలుసా? బల్లి మనకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మీ ఇంటి ప్రార్థనా గదిలో లేదా దేవుడి పటాల దగ్గర బల్లి కనిపిస్తే అది అత్యంత శుభప్రదం. ముఖ్యంగా శుక్రవారం నాడు పూజా గదిలో బల్లి కనిపిస్తే, అది సాక్షాత్తూ లక్ష్మీదేవి మీ ఇంటికి విచ్చేసినట్లుగా భావిస్తారు. ఇది ఆర్థిక స్థితి మెరుగుపడటానికి, ఐశ్వర్య ప్రాప్తికి బలమైన సంకేతం.
మీ ఇంట్లో, ముఖ్యంగా పూజా గది పరిసరాల్లో నల్లటి బల్లి కనిపిస్తే అది అశుభానికి చిహ్నం. నల్ల బల్లిని దరిద్రానికి ప్రతీకగా భావిస్తారు. ఇది ఆర్థిక నష్టాలను లేదా కుటుంబంలో పెద్ద సమస్యలను సూచిస్తుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ప్రతికూల శక్తి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఇంట్లో రెండు బల్లులు పోరాడుతున్నట్లు కనిపిస్తే.. అది కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు లేదా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని శకున శాస్త్రం చెబుతోంది. ఇలాంటి దృశ్యం కనిపిస్తే ఇంట్లో పరిశుభ్రతపై శ్రద్ధ వహించి, శాంతి పూజలు చేసుకోవడం మంచిది.
బల్లి శరీరంపై పడే భాగాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి..
కుడి భుజం: ఇది చాలా శుభప్రదం. మీకు విజయం లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
తల: తలపై బల్లి పడటం ఆందోళన కలిగించే విషయం. ఇది ఏదైనా ఆపదను లేదా చిక్కులను సూచిస్తుంది.
నేలపై పడటం: బల్లి మాటిమాటికీ నేలపై పడుతుంటే, అది రాబోయే కష్టాలకు సంకేతం కావచ్చు.
బల్లి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కనిపిస్తే అది పితృ దేవతల ఆశీస్సులకు గుర్తు. అలాగే బల్లి చేసే శబ్దం కూడా కొన్నిసార్లు రాబోయే వార్తలను సూచిస్తుంది.