రేపే క్షీరాబ్ధి ద్వాదశి.. ఇంట్లో తులసి పూజ లేదా తులసి వివాహం ఇలా జరిపిస్తే అంతా శుభమే..

|

Nov 12, 2024 | 9:13 PM

కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిధిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజు ఉదయం ఏకాదశి ఉపవాసం విరమించి సాయంత్రం ఇంట్లో తులసి మొక్కకు వివాహం జరిపిస్తారు. తులసి వివాహం హిందూ మతంలో ముఖ్యమైన పండుగ. ఈ రోజు సాలిగ్రామ స్వామితో (విష్ణువు స్వరూపం) తులసి వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు. ఇంట్లో తులసి కళ్యాణం చేయడం వలన పెళ్ళికాని యువతులకు వివాహం జరుగుతుందని ఓ నమ్మకం.

రేపే క్షీరాబ్ధి ద్వాదశి.. ఇంట్లో తులసి పూజ లేదా తులసి వివాహం ఇలా జరిపిస్తే అంతా శుభమే..
Ksheerabdi Dwadasi 2024
Follow us on

శివ కేశవులకు పవిత్రమైన కార్తీక మాసంలో నెల రోజులూ వివిధ పండగలు, ఉత్సవాలను నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి ఉపవాసం చేసి మర్నాడు అంటే ద్వాదశి రోజున ఇంట్లో ప్రత్యెక పూజలను చేస్తారు. కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిధిని క్షీరాబ్ది ద్వాదశి అని లేదా చిలుకు ద్వాదశి’ అని పిలుస్తారు. ఈ రోజున పాల కడలిని అమృతం కోసం చిలకడం మొదలు పెట్టారట. అందుకనే ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని అంటారు.

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని ద్వాదశి రోజున సాలిగ్రామానికి తులసికి వివాహం చాలా వైభవంగా చేస్తారు. కొంతమంది కార్తీక శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున, మరికొందరు ద్వాదశి నాడు తులసి కళ్యాణం నిర్వహిస్తారు. దేవుత్తని ఏకాదశి రోజున తులసి వివాహం చేసే వారు ఈ ఏడాది నవంబర్ 12న, ద్వాదశి రోజున తులసి వివాహం చేసేవారు నవంబర్ 13న చేస్తారు. తులసి వివాహ సమయంలో తులసి మొక్కతో సాలిగ్రామానికి వివాహం జరిపిస్తారు. తులసి కళ్యాణం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని నమ్ముతారు. అంతే కాకుండా భార్యాభర్తల మధ్య విబేధాలు ఉంటె అవి సమసిపోతాయని.. పెళ్లికాని యువతులకు పెళ్లి జరుగుతుందని నమ్మకం.

తులసి వివాహం 2024 తేదీ , సమయం:

ఇవి కూడా చదవండి

పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని శుక్ల పక్షం ద్వాదశి తిధి నవంబర్ 12, మంగళవారం సాయంత్రం 04:04 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 13 బుధవారం మధ్యాహ్నం 01:01 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం నవంబర్ 13వ తేదీ బుధవారం రోజున తులసి, శాలిగ్రామ స్వామి కల్యాణం నిర్వహిస్తారు.

తులసి పూజకు కావాల్సిన వస్తువులు

చిలుకు ద్వాదశి రోజున తులసి మొక్క, విష్ణుమూర్తి విగ్రహం లేదా సాలిగ్రామ ఫోటో, ఎరుపు రంగు వస్త్రం, కలశం, పూజ పీటం, సుగంధ ద్రవ్యాలు (పసుపు, కుంకుమ, చందనం, అగరవత్తులు, చందనం మొదలైనవి), పండ్లు అంటే బత్తాయిలు, ఉసిరి, రేగు, సీతాఫలం, జామ, అరటి పండ్లు, అరటి ఆకులు, కొబ్బరి కాయలు, కర్పూరం, ధూపం మొదలైనవి.

తులసి కళ్యాణం విధి విధానాలు

తులసి మొక్కకు విష్ణువు విగ్రహంతో లేదా శాలిగ్రామ రాయితో వివాహం జరిపిస్తారు. తులసి కళ్యాణం నిర్వహించడానికి సాయంత్రం సమయం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కుటుంబ సభ్యులందరూ కొత్త బట్టలు ధరించి తులసి వివాహాన్ని జరిపించడం శుభప్రదం. వివాహానికి ముందు తులసి కోటను అందంగా అలంకరించాలి. తులసి మొక్కపై ఎరుపు రంగు చున్నీని వేసి.. పసుపు , కుంకుమలను సమర్పించాలి. అనంతరం తులసి కోటలో విష్ణువు ఫోటో లేదా శాలిగ్రామాన్ని ఉంచి వివాహ కత్రువు ప్రారంభిస్తారు. వివాహ తంతులన్నీ పూర్తయిన తర్వాత అందరికీ ప్రసాదం పంచుతారు.

తులసీ వివాహం ప్రాముఖ్యత

హిందూ మతంలో తులసిని పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. తులసి లక్ష్మీదేవి అవతారంగా పరిగణించబడుతుంది. విష్ణువుకి కూడా తులసి అంటే చాలా ఇష్టం. కాబట్టి, తులసి , శాలిగ్రాముల వివాహం ఒక పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. తులసిని వివాహం జరిపించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని, పాపాలు నశిస్తాయనే నమ్మకం. తులసిని పూజించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తులసి వివాహం జరిపించిన అనంతరం ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం, అంటే తమలపాకులు, అరటి పండ్లు, పసుపు, కుంకుమ, పూలు, జాకెట్ ను పెట్టి వాయనంగా అందించాలి. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కల్యాణం జరిపించడం వలన శుభాలూ కలుగుతాయని విశ్వాసం.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.