హిందూసనాతన ధర్మంలో గ్రహణకాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణ సమయాన్ని సూతకంగా భావిస్తారు. ప్రజలు ఏ పనులను చేయరు.. అంతేకాదు .. దేశ వ్యాప్తంగా ఆలయాలనుంచి ప్రముఖ క్షేత్రాల వరకూ అన్నింటిని గ్రహణ సమయానికంటే మూసివేస్తారు. సూర్య గ్రహణం, చంద్రగహణం ఇలా ఏ గ్రహణం ఏర్పడినా సరే గుడులన్నీ మూసివేస్తారు. గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ చేపట్టి ఆలయాన్ని శుద్ధి చేసి అనంతరం మళ్ళీ భక్తులకు ఆలయదర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈ ఆచారం ఎప్పటినుంచో వస్తున్నదే.. అయితే ఈ గ్రహణ సమయంలో కూడా దేశ వ్యాప్తంగా కొన్ని దేవాలయాలు తెరచి ఉంటాయి. యధావిధిగా పూజాదికార్యక్రమాలను అందుకుంటాయి. అటువంటి దేవాలయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఒకటి అయితే.. గ్రహణాలు పట్టని గుడి మరొకటి కూడా ఉంది. ఈ గుడి తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ శక్తి పీఠంగా ఖ్యాతిగాంచింది.
పిఠాపురం పట్టణంలో గ్రహణాలు పట్టని గుడి ఒకటి ఉంది. సూర్య, చంద్రగ్రహణం ఏదైనా సరే యధావిధిగా తెరచి ఉంటుంది.. పాదగయ పుణ్యక్షేత్రం. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి యధావిధిగా పూజలను అందుకుంటారు. అనాది కాలంగా వస్తున్న పూర్వపు ఆచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో శ్రీకాళహస్తి, పిఠాపురం పాదగయ క్షేత్రం గ్రహణ సమయంలో తెరిచి ఉండే దేవాలయాలు.. ఈరోజు చంద్రగ్రహణకాలం లోను భక్తులకు దర్శనాలు, పూజలు ఉంటాయని ఆలయ అధికారులు చెప్పారు.
ప్రధాన ఆలయాలైనా రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామి, అష్టాదశ శక్తి పీఠం పురుహూతికా అమ్మవారు, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారులను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. చంద్ర గ్రహణం కాలంలో పట్టు.. విడుపు స్నానాలు చేసి అభిషేకాలు, అర్చనలు వంటి కైంకర్యాలను అర్చకులు నిర్వహిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..