
కేరళ సంస్కృతిలో భాగమైన వింత సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నాయి. వీటిని అత్యంత విశ్వాసంతో పాటిస్తారు. అందుకనే కేరళలోని ప్రతి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించాలి. దేవుడికి ఎంత భక్తిశ్రద్దలతో ప్రసాదం సమర్పిస్తారో అదే విధంగా ఒక ఆలయంలో కుక్కలను పవిత్రంగా భావించి ఆహారాన్ని అందిస్తారు. అంతేకాదు ఇక్కడ కొలువైన దేవుడికి చేపలను, కల్లుని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విందు, వింత ఆచారాలను చూడాలంటే కేరళలోని కన్నూర్ జిల్లాకు చేరుకోవాలి.
జిల్లాలోని వలపట్టణం నది ఒడ్డున పరాస్సిని మడప్పుర శ్రీ ముత్తప్పన్ ఆలయం ఉంది. ఇది ముత్తప్పన్ దేవునికి అంకితం చేయబడిన ప్రసిద్ధ దేవాలయం. శివుని అవతారంగా భావిస్తారు. ఇక్కడ దేవుడికి నైవేద్యంగా చేపలు, కల్లు సమర్పిస్తారు. ఇది ఉత్తర కేరళలో ప్రత్యేకమైన సాంప్రదాయ ఆరాధన. అంతేకాదు ఈ ఆలయంలో పూజ ఆచారాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ “తెయ్యం” ప్రదర్శన ద్వారా ఆరాధన చేస్తారు.
ఇక్కడ స్వామివారికి పండ్లు, పువ్వులు, స్వీట్లకు బదులుగా కాల్చిన చేపలు , మాంసం, కల్లును ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ వస్తువులను సమర్పించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మాంసాహారాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
ఈ ఆలయంలో కుక్కలను దేవుని ప్రతిరూపాలుగా నమ్ముతారు. అందుకనే వాటిని గౌరవంగా చూస్తారు. అంతేకాదు ఈ ఆలయంలో కుక్కలు తమ ఇష్టమైన రీతిలో తిరుగుతాయి. వాటికీ ప్రసాదాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో పూజలు అందిస్తారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి , మార్చి నెలల్లో ఆలయ ప్రధాన పండుగ అయిన ముత్తప్పన్ తిరువొప్పన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ పండుగ సమయంలో ప్రదర్శించే కేరళ సంప్రదాయ తెయ్యం నృత్యం ఆధ్యాత్మిక ఉత్సాహం, భక్తి వాతావరణాన్ని సృష్టిస్తుంది. కథాకళి ప్రదర్శనలను కూడా నిర్వహిస్టారు. ఇది ఆలయ సాంస్కృతిక గొప్పతనాన్ని చాటి చెబుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.