రామ భక్త హనుమాన్ భక్తుడు గల్లీ గల్లీకి కనిపిస్తారు. మన దేశంలో పవనసుతుడి ఆలయాలు లేదా విగ్రహం లేని ప్రాంతం బహు అరుదు అని చెప్పవచ్చు. అయితే ఈ హనుమంతుడి విగ్రహాలు కుర్చుని, నిల్చుని భక్తితో చేతులు జోడించినట్లు ఇలా వివిధ భంగిమల్లో దర్శనం ఇస్తూ ఉంటాయి. కానీ ఓ హనుమంతుడి ఆలయంలో అతని విగ్రహం ఎప్పుడూ గొలుసులతో బంధించబడి ఉంటుందని తెలుసా.. అవును ఒడిశాలో పురీ జగన్నాథుని ఆలయ సముదాయంలో ఉన్న ఓ హనుమంతుడి ఆలయం లో ఆయన్ని గొలుసులతో బంధించి ఉంచారు.
ఒడిశాలో ఉన్న పవిత్ర పూరీ క్షేత్రాన్ని జగన్నాథ్ పూరీ ధామ్ అని పిలుస్తారు. జగన్నాథుని ఆలయంతో పాటు భగవంతుని విగ్రహంతో సంబంధం ఉన్న అనేక అద్భుతాలు, రహస్యాలు పురీ జగన్నాథ్ ఆలయం సొంతం. అయితే ఈ ఆలయం చుట్టూ అనేక రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి హనుమంతుడి ఆలయం. ఈ ఆలయంలోని రామ భక్త హనుమాన్ విగ్రహం గొలుసులతో బంధించబడి ఉంటుంది.
దర్శనానికి సముద్రం అల్లకల్లోలమైంది
పురాణాల ప్రకారం జగన్నాథుడు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవతలు, గంధర్వులు మానవులు అందరూ భగవంతుని దర్శనం చేసుకోవాలని కోరుకున్నారు. జగన్నాథుని దర్శనం కోసం అందరూ పురీ ఆలయానికి చేరుకున్నారు. అందరూ జగన్నాథుడు దర్శనం కోసం వెళుతుండడం చూసి సముద్రుడికి కూడా ఆయన్ని దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది. దీంతో సముద్రుడు చాలాసార్లు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో ఆలయానికి, భక్తులకు చాలా నష్టం జరిగింది.
జగన్నాథుని సహాయం కోరిన భక్తులు
సముద్రం అనేక సార్లు ఆలయం వద్దకు వచ్చి జగన్నాథుడు దర్శనం కోసం వచ్చే భక్తులకు హాని కలిగించినప్పుడు.. భక్తులందరూ ఈ సమస్యను పరిష్కరించమని జగన్నాథుడిని అభ్యర్థించారు. ఎందుకంటే సముద్రం దేవుడిని చూడాలనే కోరిక వలన భక్తులకు జగన్నాథుని దర్శనం లభించలేదు. అప్పుడు జగన్నాథుడు సముద్రాన్ని నియంత్రించడానికి హనుమంతుడిని నియమించాడు. పవన సుతుడు సముద్రాన్ని బంధించాడు. అందుకనే పూరీ సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుందని నమ్మకం.
తెలివి చూపించిన సముద్రం
జగన్నాథుని ఆజ్ఞను అనుసరించి హనుమంతుడు సముద్రానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. దీంతో ఆలయంలోకి సముద్రం ప్రవేశించడం కష్టంగా మారింది. సముద్రుడు చాలా తెలివిగా హనుమంతుని భక్తిని ఉపయోగించుకుని.. దర్శనానికి వెళ్లని నీవు ఎలాంటి భగవంతుని భక్తుడివి అని సవాలు చేశాడు. జగన్నాథుని అద్వితీయమైన అందాన్ని కనులారా దర్శించుకోవాలని నీకు అనిపించడం లేదా అని అంటాడు. అప్పుడు హనుమంతుడు కూడా భగవంతుడిని దర్శనం చేసుకుని చాలా రోజులైంది. ఈరోజు ఎందుకు భగవంతుని దర్శనం చేసుకోకూడదు అని అనుకున్నాడు.
బజరంగబలికి గొలుసులలో బంధనాలు
పురాణాల కథ ప్రకారం సముద్రుడు హనుమంతుడిని తన మాటలతో మాయ చేయడంతో భగవంతుడి దర్శనం కోసం హనుమంతుడు సముద్రాన్ని కాపలా కాయాలి అన్న విషయాన్నీ పక్కకు పెట్టి.. జగన్నాథుడి దర్శనానికి బయలుదేరాడు. అప్పుడు సముద్రం కూడా హనుమంతుడిని అనుసరించడం ప్రారంభించింది. ఈ విధంగా పవన సుతుడు గుడికి వెళ్ళినప్పుడల్లా సాగరుడు కూడా అతనిని అనుసరించేవాడు. దీంతో ఆలయంలో మళ్లీ నష్టం జరగడం మొదలైంది. అప్పుడు జగన్నాథుడు హనుమంతుని ఈ అలవాటుతో కలత చెందాడు. అప్పుడు హనుమంతుడు కదల కుండా బంగారు గొలుసులతో బంధించాడు. ఆ ఆలయమే ఇప్పుడు జగన్నాథపురి సముద్రతీరంలో ఉన్న బేడి హనుమంతుని పురాతన ఆలయంలో హనుమంతుడు అని అంటారు. నేటికీ ఇక్కడ హనుమంతుడు గొలుసులతో బంధించి కనిపిస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు