Srivari Brahmotsavas: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంటకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. కొన్నివేల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి ని దర్శించుకుని.. తిరుమలేశుడుని సేవించుకుని తరించిన భక్తులు ఎందరో ఉన్నారు. సామాన్యులే కాదు.. కార్పొరేట్ దిగ్గజాలు, అపరకుబేరుల నుంచి రాజకీయ నాయకుల వరకూ విశేషమైన రోజుల్లో లేదా ఏదైనా పనిని ప్రారంభించే ముందు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. తమ శక్తికి తగిన విధంగా స్వామివారికి కట్న, కానుకలను సమర్పిస్తారు. అయితే ఈ సాంప్రదాయం ఇప్పడి కాదు..కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం.. అలాంటి రాజులు, జమిందార్లు, భూస్వాములు వేంకటాచల నాథుడిని కొలిచి.. తమ ఆర్ధిక పరిధిలో స్వామివారికి కానుకలను సమర్పించారు. స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కోనేటి రాయుడిని కొలిచిన వారిలో పురాణ పురుషులతో పాటు చరిత్రలో నిలిచిపోయిన రాజులూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి భక్తుల్లో ఒకరైన మైసూరు మహారాజుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. అలనాటి మైసూర్ మహారాజులు మలయప్ప స్వామికి సమర్పించిన కానుకలను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మైసూరు రాజులు సమర్పించిన కానుకల గురించి.. అప్పటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం నేటికీ అనుసరిస్తున్న విధానం గురించి నేడు తెలుసుకుందాం..
వెంకటేశుడికి మైసూరు మహారాజు పరమ భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయాభివృద్ధి కోసం మహారాజులు అచంచల భక్తిభావంతో భూరి విరాళాలను సమర్పించారు. శ్రీవారి మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తులకు కూడా అనేక అమూల్యమైన నగలను బహుకరించారు. బంగారు, వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలు వంటి నవ రత్నాలతో కూడిన విలువైన ఆభరణాలను కానుకగా ఇచ్చారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలకు వినియోగించే గరుడ, గజ, ముత్యపు పందిరితో పాటు సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను మైసూరు మహారాజులే అందించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని ముఖ్యమైన ఐదవ రోజు ఉదయం జరిపే పల్లకీ ఉత్సవంలో .. ఉపయోగించే పల్లకీని మైసూరు మహారాజు బహుకరించారు. ఈ పల్లకి ప్రత్యేకత ఏమిటంటే.. పూర్తిగా ఏనుగు దంతాలతో తయారు అయింది.
దాదాపు 300 ఏళ్ల క్రితం శ్రీవారి నిత్య ధీపారాధనకు అవసరమైన ఆవునెయ్యిని మైసూర్ సంస్థానం నుంచి ఇవ్వడం ప్రారంభించారు. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తూ.. స్వామివారికి తెల్లవారుజామున జరిపే శ్రీవారి సుప్రభాతం సేవకు ముందు నవనీత హారతి, అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి ప్రతి రోజు 5 కిలోల ఆవునెయ్యిని అందిస్తున్నారు.
మైసూర్ మహారాజు శ్రీవారి ఆలయాభివృద్ధికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మించిన ఉత్తరాబాధ్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి నెల ఆ రోజు రాత్రి రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అంతేకాదు.. శ్రీవారికి ఉగాది, దీపావళి పర్వదినాలలో పాటు అణివార ఆస్థానాల్లో మైసూరు మహారాజు పేరిట ప్రత్యేక హరతిని ఇస్తారు.
అంతేకాదు.. కృష్ణాష్టమి పర్వదినం రోజున తిరుమలపై నిర్వహించే ఉట్లోత్సవం సందర్భంగా శ్రీవారు కర్ణాటక సత్రాలకు ముందుగా విచ్చేస్తారు. తర్వాత ఉట్లోత్సవంలో పాల్గొని అనంతరం ఆలయానికి చేరుకుంటారు. ఈ పద్ధతిని గత 300 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆలయ సిబ్బంది పాటిస్తుండడం విశేషం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..