పట్టణాల నుంచి వచ్చే మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతున్న పవిత్ర నదులకు పునరుజ్జీవనం కల్పించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అందులో గంగా నది ప్రక్షాళన కోసం ‘నమామి గంగే’ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ కార్యక్రమంలో అనుకున్నంత పురోగతి మాత్రం కనిపించడం లేదు. ‘నమామి గంగే’ను స్ఫూర్తిగా తీసుకున్న జమ్ము-కాశ్మీర్ యంత్రాంగం ‘దేవిక’ నది ప్రక్షాళనకు నడుం బిగించింది. అదిప్పుడు చివరి దశకు చేరుకుంది. ‘దేవిక’ నది జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లే మార్గంలో ఉన్న ‘ఉధంపూర్’ పట్టణం మధ్యలో నుంచి ప్రవహిస్తూ ముందుకెళ్లి రావి (తావి) నదిలో కలుస్తుంది. హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే గంగా నదికి సోదరిగా పేరున్న ‘దేవిక’ ప్రయాణం మాత్రం గంగకు వ్యతిరేక దిశలో సాగి ‘సింధు’ నది ద్వారా అరేబియా సముద్రానికి చేరుకోవడంతో ముగుస్తుంది.
7వ శతాబ్దంలో నేల ముని రాసిన నీల్‌మత్ పురాణంలో దేవిక నది ప్రస్తావన ఉంది. చీనాబ్ – రావి నదుల మధ్య భాగంలో ఉన్న మాదర దేశ ప్రజల కోసం పార్వతి దేవి ఈ నదిని సృష్టించారని పురాణ కథనం. శివ రాత్రి రోజు ఈ నది ఆవిర్భావం జరిగిందని చెబుతారు. దేవిక నదీ తీరం వెంట 8 ప్రాంతాల్లో ఆ పరమ శివుడు లింగాల రూపంలో ఉద్భవించి పార్వతీ దేవి వెంట నడిచారని నీల్‌మత్ పురాణం చెబుతోంది.
‘దేవిక’ నదీ తీరంలో జపం, లేదా మరే ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదని, కేవలం నది నీటిని తాకినా లేదా స్నానమాచరించినా చాలు ఎన్నో పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులతో కలిగే ప్రయోజనాలన్నీ కలుగుతాయని ‘దేవీ మహత్యం’ గ్రంథం చెబుతోంది. గంగా తీరంలో అంత్యక్రియలు చేస్తే ఆ జీవుడికి ముక్తి లభిస్తుందని హిందువుల నమ్మకం. అదే తరహాలో ‘దేవిక’ నది ఇసుకలో శరీరాన్ని పాతిపెట్టినా అంతే పుణ్యం, ముక్తి పొందుతారని విశ్వసిస్తారు. ప్రస్తుతం నది ఇసుక, పట్టణ వ్యర్థాలు, మురుగుతో నిండిపోగా.. ఇసుక పొరల కింద నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ఒక అడుగు మేర ఇసుకను తొలగిస్తే నీరు బయటపడుతుంది.
కేంద్ర ప్రభుత్వం నమామి గంగే తరహాలో పవిత్రత కల్గిన దేవిక నది పునరుజ్జీవనం కోసం 2019లో రూ. 190 కోట్లతో ‘దేవిక రిజువనేషన్ ప్రాజెక్టు’ చేప్టటింది. దేవిక నదిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేసేలా ‘లిక్విడ్ వేస్టే మేనేజ్మెంట్’ ప్రాజెక్టుతో పాటు సాలిడ్ వేస్టే మేనేజ్మెంట్ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఉధంపూర్ పట్టణం సహా పరిసర ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి పైపులు, మ్యాన్‌హోల్స్ అనుసంధానిస్తూ మురుగునీరు నేరుగా నదిలో కలవకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్బన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ (UEED) ఈ పనులను చేపట్టింది. 90:10 నిష్పత్తి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు కోసం నిధులను సమకూర్చుతున్నాయి. లిక్విడ్ వేస్టే మేనేజ్మెంట్ ప్రాజెక్టులో భాగంగా 8 MLD, 4 MLD, 1.6 MLD (మిలియన్ లీటర్స్ పర్ డే) సామర్థ్యాలతో మూడు మురుగునీటి శుద్ధి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మొత్తం 129.27 కి.మీ మేర పైపులైన్లను ఏర్పాటు చేసి, ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాలకు కనెక్ట్ చేశారు. పట్టణం నుంచి నేరుగా ఏ ఒక్క చోట నుంచి కూడా మురుగు నీరు నదిలోకి చేరకుండా పకడ్బందీగా ప్రాజెక్టు పనులు చేపట్టారు.
అలాగే నదీ తీరంలో రెండు ఘాట్లను ప్రత్యేకంగా అంత్యక్రియల కోసం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నదీ తీరం వెంట ఫెన్సింగ్, సుందరీకరణతో పాటు చిన్న హైడ్రోపవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే నదిలో కాలుష్యం పోయి నీటి నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పనుల పురోగతిని ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తాజాగా సమీక్షించారు. ఉధంపూర్ జిల్లా కలెక్టర్ సచిన్ కుమార్ వైశ్య, ఉత్తర రైల్వే అదనపు డీఆర్ఎం బల్దేవ్ రాజ్, ఉధంపూర్ ఎస్ఎస్పీ డా. వినోద్ కుమార్ సహా జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం