Inavolu Mallanna Jatara: గజ్జెల్లాగుల సవ్వడులు.. ఒగ్గు గోలి దరువు.. ఐనవోలు జాతర మహారంభం..

|

Jan 13, 2023 | 5:03 PM

సంక్రాంతి పర్వదినాన నిర్వహించే ప్రభ బండ్ల వేడుకను చూడటానికి జనం వేలసంఖ్యలో తరలివస్తారు.. ఐనవోలు మల్లికార్జునుడి కరుణా కటాక్షాలు లభిస్తే ఎలాంటి కష్టాలు ధరి చేరవనేది ఇక్కడి భక్తుల నమ్మకం..

Inavolu Mallanna Jatara: గజ్జెల్లాగుల సవ్వడులు.. ఒగ్గు గోలి దరువు.. ఐనవోలు జాతర మహారంభం..
Inavolu Brahmotsavam
Follow us on

పరమశువుడి ప్రతిరూపమే మల్లికార్జునుడు… కాకతీయుల కాలంనాటి శైవక్షేత్రాలలో అత్యంత ప్రత్యేకత కలిగిన క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం… ఈ దేవాలయంలో సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకుసాగే మల్లన్న బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా జరుగుతాయి..ఐనవోలు మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు పోటెత్తుతున్నా రు.. సంక్రాంతితో మొదలై మూడు నెలల పాటు జరిగే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలలో కోర మీసాల మల్లన్నకు బోనాలు-పట్నం ముగ్గులతో మొక్కులు చెల్లించు కోవడం ఆనవాయితీ. శివసత్తుల పూనకాలు.. ఒగ్గుపూజారుల ఆటపాటలు.. గజ్జెల్లాగులతో సాంప్రదాయ నృత్యాలు..గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మ సమేతంగా కొలువైన మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు రాష్ట్రాలు దాటి వస్తుంటారు.

ప్రతియేటా సంక్రాంతి నుండి మొదలై ఉగాది వరకు సాగే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.. జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు 3నెలల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రధానంగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు మల్లన్న జాతరకు పోటెత్తుతారు. మూడు నెలలపాటు సాగే ఈ జాతరలో వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. సంక్రాంతి పర్వదినాన ఐనవోలు క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది..

ఐనవోలు మండల కేంద్రంలో కొలువైన ఈ దేవాలయానికి ఘన చరిత్రే ఉంది. కాకతీయుల పాలనా సమయంలో ఈ దేవాలయం నిర్మించారు.. అయ్యన్నదేవుడు అనే మంత్రి ఈ ఆలయాన్ని నిర్మించాడని, అందుకు గుర్తుగానే ఈ గ్రామానికి అయ్యన్నవోలుగా నామకారణం చేసినట్లు చరిత్ర. క్రమక్రమంగా ఐనవోలుగా రూపాంతరం చెందిందని స్థానికులు చెబుతుంటారు.. ఈ దేవాలయానికి నలుదిక్కులా కాకతీయ స్వాగత తోరణాలు, నృత్యమండపం, అష్టోత్తర స్తంభాలు, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల వైభవాన్ని గుర్తుచేసుకునేలా సాక్షాత్కరిస్తాయి.. కాకతీయ మహారాజులు యుద్దానికి ముందు తమ సైన్యంలో ప్రేరణ కలిగించేందుకు ఐనవోలు లోని నృత్య మండపంలో పేరిణి నృత్యం చేయించేవారని.. యుద్దానికి సంబంధించిన ముఖ్య సమావేశాలనూ ఐనవోలులో నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతుంటారు..

ఇవి కూడా చదవండి

కష్టాలు తీరుస్తూ.. కోరిన కోర్కెలు నెరవేర్చే కోరమీసాల మల్లన్నగా ఈ మల్లికార్జున స్వామిని పూజిస్తారు. బోనం, తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. సంతానం లేనివారు కొబ్బరికాయతో ముడుపు కడుతుంటారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.. ఈ జాతరలో ఒగ్గుకథలకు ఓ ప్రత్యేకత ఉంటుంది.. ఒగ్గు పూజారులు వారి ఆచారం ప్రకారం మల్లన్నను స్తుతిస్తారు. ఐనవోలు ప్రాంగణం అంతా సంక్రాంతి పర్వదినాన శివసత్తుల పూనకాలు, డమరుకనాధాలతో దద్దరిల్లిపోతుంది. సంక్రాంతి పర్వదినాన నిర్వహించే ప్రభ బండ్ల వేడుకను చూడటానికి జనం వేలసంఖ్యలో తరలివస్తారు.. ఐనవోలు మల్లికార్జునుడి కరుణా కటాక్షాలు లభిస్తే ఎలాంటి కష్టాలు ధరి చేరవనేది ఇక్కడి భక్తుల నమ్మకం..

కుటుంబ సమేతంగా వచ్చి మూడు రోజులపాటు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఇక్కడ పసుపు బండారే మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాకతీయుల కాలంనుండే ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్తులు ఆలయ బాధ్యతలు చూసుకునే వారు..1969 సంవత్సరంలో ఆలయ నిర్వహణను స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు.. అప్పటినుండి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి..ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..