
తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేదీ.. ఈ లడ్డూనే! ఎవరు తిరుపతికి వెళ్లినా.. ప్రసాదం ఎక్కడ అని ఆత్రంగా వెతికేదీ ఈ లడ్డూ కోసమే! ఎవరు తిరుమలకు వెళ్లొచ్చినా.. ఇంటికి వచ్చి..దీపారాధన చేసి..నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే! అమెరికాలో ఉన్నా..ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఈ లడ్డూ కోసమే! ఎప్పుడు తెలుగు గడ్డకు వచ్చినా.. తిరుమలకు గబగబా మెట్లెక్కి శ్రీవారిని దర్శించి..ఆ స్వామి వర ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేది ఈ లడ్డూనే! విశ్వరూపధారి అయిన తిరుమల గోవిందుడు.. మన ఇంటికి వచ్చేది ఈ లడ్డూ రూపంలోనే! ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు.. కోట్లాది భక్తుల ఎమోషన్! ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. “తిండిమొండయ్య నైవేద్య ప్రియుడంటూ..” అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, కైంకర్య ప్రియుడే కాదు..నైవేద్య ప్రియుడు కూడా! ప్రపంచంలో ఎక్కడా జరగనన్ని నివేదనలు శ్రీవారికి జరుగుతాయి. కానీ అన్నిటికంటే అటు శ్రీవారికీ, ఇటు భక్తులకు ప్రియమైనది లడ్డూ ప్రసాదమే! అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమలను దర్శించినప్పుడే.. “తిండిమొండయ్య నైవేద్య ప్రియుడంటూ..” కలియుగ దైవాన్ని ఆటపట్టించేవాడుట! తిరుమల వైభవం గురించి చెప్పాలంటే.. ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే! తిరుమల లడ్డు. ఆ లడ్డూ ప్రసాదం మాధుర్యానికి 310 ఏళ్లు నిండింది. అమృత పదార్ధంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డూ ఇప్పుడు చర్చగా మారింది. లడ్డూ లోని నెయ్యి కల్తీ...