ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, చరిత్ర ఉంది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం కూడా ప్రధానమైనదిగా చెప్పొచ్చు. నెట్టికంటి హనుమాన్‌ను నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే జయంతి ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో అలరిస్తారు నెట్టికంటి ఆంజనేయుడు. తొలిరోజు పుష్పాలంకరణ, రెండో రోజు గంధాలంకరణ, మూడో రోజు డ్రైఫ్రూట్స్ అలంకరణ, నాలుగో రోజు వివిధ రకాల పండ్లతో అలంకరణ, 108 కలశాలతో అభిషేక సేవ, ఐదో రోజు స్వర్ణ వజ్రకవచ అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిలో భాగంగా.. మూడో రోజు ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు నెట్టికంటి ఆంజనేయుడు.
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మూడవ రోజు ఆలయ వేద పండితులు, అర్చకులు ఆంజనేయస్వామిని డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా అలంకరించారు. ద్రాక్ష, గోడంబి, ఖర్జూరం, చెర్రీ, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌తో స్వామివారిని అలంకరించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేక అలంకరణలోనున్న నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మూడో రోజులో భాగంగా.. ఉదయం ప్రత్యేక అలంకరణ తర్వాత సుందరకాండ పారాయణం, మన్య సూక్త హోమం నిర్వహించారు వేద పండితులు. సాయంత్రం సింధూరంతో లక్ష అర్చన చేపట్టారు.
నాలుగో రోజులో భాగంగా ఇవాళ వివిధ రకాల పండ్లతో అలంకరణ, 108 కలశాలతో అభిషేక సేవ, రేపు ఐదో రోజున హనుమాన్ జయంతి సందర్భంగా స్వర్ణ వజ్రకవచ అలంకరణలో స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. ఇక.. కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు దేవదాయ శాఖ అధికారులు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..