తమిళనాడులోని సేలం సమీపంలోని నమక్కల్ లో ఉన్న హనుమంతుడి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారు జామున ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారికి భారీ వడ మాలను సమర్పిమ్చారు. హనుమాన్ జయంతి వేడుకల నేపధ్యంలో మూల విరాట్ ను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను ప్రతి ఏడాది మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున నిర్వహిస్తారు. వేకువజామున 18 అడుగుల పొడవున్న స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయడంతో పాటు 1,00,008 వడల తో తయారు చేసిన మాలను అలంకరించారు. విశేష పూజల అనంతరం కర్పూర హారతినిచ్చారు. మధ్యాహ్నం కొబ్బరి నూనె, పాలు, పెరుగు, చందనం, శనగ పిండి, పంచామృతంతో అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు ఆంజనేయ స్వామికి ముత్తంగి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం 18 అడుగుల పొడవుతో దేశంలోనే పొడవైన హనుమాన్ విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఈ భారీ హనుమాన్ విగ్రహం ఏక శిలా విగ్రహం. ఇది 5వ శతాబ్దం నాటిదని నమ్మకం. ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో పాండ్య పాలకులు నిర్మించారు. ఆలయ గర్భాలయానికి పైకప్పు ఉండదు. ఆంజనేయుడు తన నడుములో ఖడ్గాన్ని ధరించి సాలిగ్రామంతో చేసిన మాల చేతపట్టుకుని భక్తులకు దర్శనం ఇస్తాడు.
హనుమంతుడి పూజలో వడ మాలకు విశేష ప్రాధాన్యత
దక్షిణ భారతదేశంలో హనుమంతుడి ఆలయాల్లో వడమాల నైవేద్యం ప్రసిద్ధి చెందింది. అయితే ఇలా వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించడం వెనుక పురాణ కథ ఉంది. హనుమంతుడు చిన్నతనంలో.. బాల భానుడి చూసి.. అది తినే వస్తువుగా భావించి ఇష్టపడి.. సూర్యుడిని పట్టుకోవడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాడు. అదే సమయంలో రాహు గ్రహం.. గ్రహణం కోసం సూర్యుడిని పట్టుకోవడానికి వస్తున్నాడు. ఇరువు ఒకే సమయంలో సూర్యుడి వైపు పయనించడం మొదలు పెట్టినా.. ఈ రేసులో, హనుమంతుడు, వాయు నందనుడు సులభంగా గెలిచాడు. బాల హనుమంతుని శౌర్యం చూసిన రాహువు హనుమంతుడిని మెచ్చుకున్నాడు. అంతేకాదు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు. హనుమంతుడిని పూజించే వారు మినప పప్పుతో చేసిన ఆహరాన్ని నైవేద్యంగా సమర్పిస్తే రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నాడు. అయితే అలా సమర్పించే మినప పప్పు ప్రసాదం ఎలా ఉండాలో కూడా వివరించాడు. అది పాములా ఉండాలి.. అంటే తన శరీర భాగంలా ఉండాలని రాహువు హనుమంతుడికి వివరించాడు. అందుకనే హనుమాన్ ఆలయాల్లో వడమాలలను భక్తులు సమర్పిస్తారు. అయితే ఈ వడమాలలోని వడల సంఖ్యకు నియమాలు లేవు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..