Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. హంసవాహనంపై ఊరేగిన స్వామివారి వైభవం..

| Edited By: TV9 Telugu

Mar 05, 2024 | 12:31 PM

గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలువీరభధ్ర స్వామి వరకు జరిగిన ఊరేగింపు ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. ఈ వాహనసేవ పూజ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. హంసవాహనంపై ఊరేగిన స్వామివారి వైభవం..
Hamsa Vahana Seva
Follow us on

శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడవ రోజు హంస వాహానంపై దర్శనమిచ్చారు స్వామి అమ్మవార్లు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మూడవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి హంస వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు,వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంస వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక హారతులిచ్చారు. శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలించారు.

అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరో శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైలమహాక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భ్రామరి సమేతుడైన శ్రీశైలేశుడు త్రిశూలధారియై హంస వాహనంపై విహరించారు. రాజగోపురం గుండ హంస వాహనాదీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుతో, బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారింపజేశారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్‌ పథక్‌, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. హంస వాహానంపై స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.

ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలువీరభధ్ర స్వామి వరకు జరిగిన ఊరేగింపు ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. ఈ వాహనసేవ పూజ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..