( Ravi Kumar, TV9 Reporter, West Godavari )
Dwaraka Tirumala – Pig infestation: పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎక్కడ చూసినా పందులతో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో భక్తులు.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి.. రెండు కాదు మందలు మందలుగా వరాహాలు స్వైరవిహారం చేస్తున్న విషయం ప్రస్తుతం ద్వారకాతిరుమల శేషాచల కొండపై చర్చనీయాంశంగా మారింది. ద్వారక తిరుమలలోని చినవెంకన్న దర్శనం కోసం నిత్యం వేలాది భక్తులు కొండ మీదకు వస్తుంటారు. వీరిలో కొందరు వాహనపూజలు చేయించుకుంటారు. అలాంటి పూజలు చేసే ప్రాంతంలోనే వారాహాలు సంచారం చేస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కలియుగదైవమైన చినవెంకన్నను దర్శించుకున్న తర్వాత భక్తలు కొండపైకి అన్నదానం కోసం వెళుతుంటారు. ఆ దారిలోనూ పందులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు కొంతసేపు అలసట తీర్చుకునేందుకు చెట్ల కింద కూర్చొవాలనుకున్నా.. వీలు కుదరడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడైనా వెంటతెచ్చుకున్న సామాన్లు, ప్రసాదాలను ఉంచినా.. వాటిని నేల పాలు చేస్తున్నాయని భక్తులు వాపోతున్నారు.
గతంలో కొండపైన మొక్కలను పెంచి వాటిని భక్తులకు పంచేవారు, దీంతో పాటు అన్నదానంకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను సైతం పండించేవారు. ఇప్పుడు అలాంటివన్నీ ఒక్కొక్కటిగా తెరమరుగవుతున్నాయి. శేషాచలంలో భక్తులు చూసేందుకు గోశాల, గజశాల, అశ్వశాల ఉంది. వీటితో పాటు చిలుకలు , కుందేళ్లను పెంచుతున్నారు.
అయితే పరిసరాల్లోని పందులు కొండపైకి వచ్చి సంచరిస్తూ ఉండటంతో భక్తులకు మానసిక ఉల్లాసం లేకుండా పోతుంది. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసోకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు సీజనల్ వ్యాధులు ప్రభలే సమయమని అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.
Also Read: