
Ganesh Chaturthi 2021: గణేష్ పండుగ ప్రారంభమైంది. ప్రజలందరు విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. 9 రోజులపాటు గణేశుడి పూజలు చేస్తారు. ఆయన ఆశీస్సులు పొందడానికి నిష్టతో ఉంటారు. మండపాల వద్ద, ఆలయాలలో నవరాత్రులు గడుపుతారు. అయితే ఇలాంటి సమయంలో భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుభ్రతను పాటించాలి. ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించాలి. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏవి చేయాలి, ఏవి చేయకూడదో ఒక్కసారి తెలుసుకుందాం.
1. గణేశ్ ప్రతిమను జాగ్రత్తగా తీసుకెళ్లాలి
గణేశ్ విగ్రహం మట్టితో తయారవుతుంది. కాబట్టి చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు గణేశ్‌ని తీసుకెళ్లేటప్పుడు, ప్రతిష్ఠాపన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దండలు, ఆభరణాలు అందంగా కనిపించేలా ఉండాలి. తొమ్మిది రోజులు విగ్రహాన్ని ఒకరు కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలి.
2. మాంసం తినవద్దు
మనలో చాలా మందికి ఈ విషయం తెలుసు. గణేశ్ పండుగ సమయంలో మాంసాహారం తినకూడదు. మద్యపానం చేయకూడదు. సంప్రదాయాన్ని పాటించకపోతే మంచి జరుగదని మన పురాణాలలో చెప్పారు. మండపం చుట్టూ శుభ్రతను పాటించాలి.
3. ముహూర్తం ప్రకారం ప్రతిష్ఠాపన జరగాలి..
గణేశ్ విగ్రహం ముహూర్తం ప్రకారం ప్రతిష్ఠించాలి. మన సౌలభ్యం ప్రకారం ప్రతిష్టించకూడదు. ఎందుకంటే మంచి ఫలితాలను పొందడానికి అంతా ముహూర్తం ప్రకారం జరిగితే బాగుంటుంది.
4. ఉల్లిపాయ, వెల్లుల్లి తినవద్దు
గణేశుడి నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లి తినవద్దు. ఈ రెండింటిని ప్రతి ఇంట్లో వంటలలో వాడుతారు. అయితే మనం వినాయకుడి మండపంలో ఉంటే వీటికి దూరంగా ఉండాలి. అప్పుడే మంచి జరగుతుంది.