Diwali: దీపావళి రోజున మీ రాశి ప్రకారం ఈ పని చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట!
Diwali Zodiac Remedies Telugu: 2026 దీపావళి నవంబర్ 8న జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని భావిస్తున్నారా? అయితే మీ రాశి ప్రకారం ప్రత్యేక పరిహారాలు పాటించండి. 12 రాశుల వారు అమ్మవారికి ఏ పువ్వులు, నైవేద్యాలు సమర్పించాలి? ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకోండి.

Diwali Astrology Telugu: 2026లో దీపావళి పండుగ నవంబర్ 8, ఆదివారం రోజున జరుపుకోనున్నారు. హిందూ సంప్రదాయంలో దీపావళికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీ పూజతో పాటు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ ఏడాది దీపావళికి ముందు శుక్రుడు వక్రగతిలో, నీచస్థితిలో ఉండగా.. బుధుడు కూడా వక్రగతిలో సంచరిస్తాడు. సూర్యుడు నీచస్థితిలో ఉండటంతో పాటు గురు గ్రహం కేతువుతో కలిసి ఉండటం వల్ల గ్రహాల స్థితిగతులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీపావళి రోజున తమ రాశికి అనుగుణంగా లక్ష్మీదేవిని పూజించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం.
దీపావళి 2026: రాశుల వారీగా పాటించాల్సిన పరిహారాలు
- మేష రాశి: ఈ రాశికి కుజుడు అధిపతి. కాబట్టి మేష రాశి వారు దీపావళి రోజున లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించాలి. నెయ్యితో దీపం వెలిగించి, పూజ సమయంలో ‘ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః’ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సంతోషం కలుగుతుందని నమ్ముతారు.
- వృషభ రాశి: శుక్రుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు అమ్మవారికి తెల్లని పువ్వులు, పాలతో చేసిన ఖీర్ నైవేద్యంగా సమర్పించాలి. సుగంధ ధూపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించాలి.
- మిథున రాశి: బుధుడు అధిపతి కావడంతో ఈ రాశి వారు లక్ష్మీదేవికి పచ్చి యాలకులు లేదా పచ్చని పండ్లు సమర్పించాలి. గణేశుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయని విశ్వాసం.
- కర్కాటక రాశి: చంద్రుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు అమ్మవారికి తెల్లని మిఠాయిలు, తామర పువ్వులు సమర్పించాలి. పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. వెండి పాత్రలో నీటిని ఉంచి పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
- సింహ రాశి: ఈ రాశికి సూర్యుడు అధిపతి. సింహ రాశి వారు లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి, బెల్లం లేదా గోధుమ పిండితో చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. గౌరవం, కీర్తి, అభివృద్ధి కలగాలని ప్రార్థించాలి.
- కన్యా రాశి: బుధుడు అధిపతి కావడంతో ఈ రాశి వారు పచ్చని యాలకులు, సువాసనగల పువ్వులను అమ్మవారికి సమర్పించాలి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ప్రార్థించాలి.
- తులా రాశి: శుక్రుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు తెల్ల తామర లేదా తెల్లని పువ్వులను సమర్పించాలి. ఖీర్ నైవేద్యంగా పెట్టి, ఇంటి పూజా మందిరంలో నెయ్యి దీపం వెలిగించాలి.
- వృశ్చిక రాశి: కుజుడు అధిపతి కావడంతో ఎర్రటి పువ్వులు, బెల్లం అమ్మవారికి సమర్పించాలి. ముందుగా గణేశుడిని పూజించి, అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
- ధనుస్సు రాశి: గురుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు మిఠాయిలను లక్ష్మీదేవికి సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠిస్తూ సంపద, జ్ఞానం, అదృష్టం కలగాలని ప్రార్థించాలి.
- మకర రాశి: శని అధిపతిగా ఉండే ఈ రాశి వారు ఎరుపు, తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించాలి. పూజా మందిరంలో ఆవనూనెతో దీపం వెలిగించాలి.
- కుంభ రాశి: ఈ రాశికి కూడా శనిదేవుడే అధిపతి. కుంభ రాశి వారు లక్ష్మీదేవికి నీలం లేదా తెలుపు రంగు పువ్వులు సమర్పించాలి. అనంతరం ధాన్యాలు, నల్ల నువ్వులను పేదలకు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
- మీన రాశి: గురుడు అధిపతిగా ఉండే మీన రాశి వారు పసుపు పువ్వులు, కుంకుమపువ్వు, పసుపు రంగు మిఠాయిలను అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా భక్తితో పూజించాలి.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పరిహారాలు జ్యోతిష్య, మత విశ్వాసాల ఆధారంగా అందించినవి. వీటిని పాటించడం పూర్తిగా వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. వీటికి శాస్త్రీయంగా నిరూపితమైన ఫలితాలు లేవు.)




