ప్రజలు ప్రపంచంలోని అనేక రకాల వ్యక్తులను తరచుగా కలుసుకుంటారు. కొన్నిసార్లు స్నేహితులు కూడా శత్రువులుగా మారతారు. తెలియని వ్యక్తులను.. కొన్ని రకాల ఆలోచనలు ఉన్నవారిని ఎప్పుడైనా నమ్మి చేరదీసినా, సహాయకుడిగా చేసుకున్నా .. సమయం బట్టి మోసం చేసి వెళ్లిపోతారు. జీవితంలో ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి? ఎవరితో స్నేహం చేయాలి? ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అందించాడు.
ఆచార్య చాణక్యుడి చెప్పిన నీతులను జీవితంలోకి అన్వయించుకుని .. వాటిని శ్రద్ధగా పాటిస్తే మీ జీవితాన్ని సులభంగా గడపవచ్చు. కనుక చాణుక్యుడు చెప్పిన విధముగా జీవితంలో కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలి? ఎవరిని విశ్వసించాలి తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు మూర్ఖుడిని జంతువుగా అభివర్ణించాడు. మానవుడే అయినా తెలివి, విచక్షణ లేనివాడు పశువుతో సమానం. కనుక వారితో సహవాసం చేయకూడదు. అలాంటి వారితో సహవాసం చేసే వ్యక్తిని ఎప్పుడూ కష్టాలు చుట్టుముడతాయి. మూర్ఖుడైన స్నేహితుడు కంటే తెలివైన శత్రువు మంచివాడు.
అహంతో నిండిన స్వభావం ఉన్న వ్యక్తికి, తనను తాను అత్యంత జ్ఞానవంతుడిగా భావించే వ్యక్తికి ఎప్పుడూ మద్దతు ఇవ్వకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు పిల్లిలా ఉంటారు. ఎవరిని ఎప్పటికీ నమ్మలేరు. తమను తాము గొప్పగా కనిపించేలా చేయడం కోసం నమ్మిన స్నేహితుల ఇమేజ్‌ను పాడు చేయవచ్చు. అవమానించడానికి కూడా వెనుకాడరు. కనుక ధనము లేక జ్ఞానము పట్ల అహంకారం లేని వారితో మాత్రమే స్నేహము చేయాలి.
జీవితంలో అత్యాశపరులకు మద్దతు ఇవ్వకూడదు. మీతో సమానమైన వ్యక్తులతో ఎల్లప్పుడూ స్నేహం చేయండి. తనకంటే బలహీనమైన, అత్యాశ కలిగిన వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. అత్యాశగల వ్యక్తి తన సొంత ప్రయోజనం కోసం ఎప్పుడైనా మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. ప్రత్యర్థిని కలవడం ద్వారా హాని చేయవచ్చు. అందుచేత తమకు లభించిన వాటితో తృప్తిగా ఉన్నవారిని మాత్రమే ఉంచుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.
ఆచార్య చాణక్యుడు తన విధానంలో చెడ్డ వ్యక్తిని ఎప్పుడూ తనతో ఉంచుకోకూడదని చెప్పాడు. అలాంటి వారు పాముల కంటే ప్రమాదకరం. పాము అవతలి వ్యక్తి తనకు హాని కలిగించినప్పుడు మాత్రమే కాటేస్తుంది. దుష్టుడికి విశ్వాసం ఉండదు. ఇలాంటి నేచర్ ఉన్నవారు ఎప్పుడైనా ఎక్కడైనా ద్రోహం చేసి ప్రాణాలను తీయవచ్చు. అందువల్ల ఎల్లప్పుడూ మంచి, సంస్కారవంతమైన వ్యక్తులతో మాత్రమే స్నేహం చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు