Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం .. లాల్‌దర్వాజా బోనాలకు తరలి వస్తున్న ప్రముఖులు, భక్తులు

ఆషాడ మాసం చివరికి చేరుకోవడంతో భాగ్యనగరంలో బోనాల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ రోజు పట్నం మొత్తం బోనమెత్తింది. వేపాకుల తోరణాలు... పోతరాజుల విన్యాసాలు... శివసత్తుల పూనకాలు... అమ్మవారి పాటల నడుమ సిటీలో గల్లీ గల్లీలో పండుగ సందడి నెలకొంది. అమ్మవారి సేవలో పులకిస్తుంది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు ఆషాడ మాసం చివరి ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ముగియనున్నాయి.

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం .. లాల్‌దర్వాజా బోనాలకు తరలి వస్తున్న ప్రముఖులు, భక్తులు
Lal Darwaza Bonalu

Updated on: Jul 22, 2025 | 3:56 PM

హైదరాబాద్ నగరంలో బోనాలు నేటితో ముగియనున్నాయి. ఆషాడ మాసం తొలి గురువారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో మొదలైన బోనాల ఉత్సవాలు ఈ రోజు పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించడంతో ముగియనున్నాయి. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహాంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారు జాము నుంచే అమ్మవారికి మహాభిషేకం, ధూప దీప నైవేద్యాలతో పూజలు జరుగుతున్నాయి. అమ్మవారికి బలిహరణం, అభిషేకం అనంతరం భక్తులు బోనాలను సమర్పించడం మొదలు పెట్టారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్‌ సింహవాహిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించనున్నారు.

భాగ్యనగరం ఎటు చూసినా సంబరమే.. ఎటు విన్నా అమ్మవారి నామస్మరణే. లాల్‌దర్వాజ సింహవాహినీ అమ్మవారి బోనాల జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి బోనాల కోసం పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. సుమారు 2500 మంది పోలీసులతో ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతోపాటు జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పార్టీలకు అతీతంగా నేతలంతా కూడా లాల్‌దర్వాజా బోనాలకు తరలి వెళ్తున్నారు.
అమ్మవారికి దర్శించుకోవడం సంతోషంగా ఉందని బీజేపీ మహిళా నాయకురాలు మాదవీ లాత అన్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటున్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..