
బిల్వ పత్రం లేని శివుని భక్తి, శివ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దేవతల దేవుడైన మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సమర్పించే నైవేద్యాలలో బిల్వ పత్రానికి ఉత్తమ స్థానం ఉంది. శ్రావణ మాసంలో శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఏడాది పొడవునా శివుని పూజలో బిల్వ పత్రం కలిగి ఉండటం తప్పనిసరి. అయితే కొన్ని ప్రత్యేక తిధుల్లో, పండగలలో కూడా శివుడికి బిల్వ పత్రం సమర్పించడం వలన అనేక రెట్లు ఫలితం లభిస్తుంది. బిల్వ పత్రం ఆరోగ్యం, అదృష్టాన్ని పెంచుతుంది. బిల్వ పత్రం అనేక ఆధ్యాత్మిక, మతపరమైన, ఆయుర్వేద ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి కనుక శివుని ఆరాధనకు బిల్వ పత్రం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకుందాం.
పురాణ నమ్మకాల ప్రకారం దీని వెనుక రెండు కథలు ఉన్నాయి. మొదటి నమ్మకం ప్రకారం సముద్ర మంథనం సమయంలో కాలకూట అనే విషం బయటకు వచ్చినప్పుడు.. లోకాన్ని రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని తన గొంతులో దాచాడు. దీని కారణంగా శివుడి శరీరం మండడం ప్రారంభమైంది. విషం ప్రభావంతో శివుడి గొంతు మండుతోంది. అప్పుడు దేవతలు శివుడికి మంట నుంచి ఉపశమనం కోసం బిల్వ పత్రంతో ఉన్న నీటిని అందించడం ప్రారంభించారు. అపుడు శివుడికి శాంతి, చల్లదనాన్ని ఇచ్చింది, అప్పటి నుంచి బిల్వ పత్రం శంకరుడికి సమర్పించే ఆచారం కొనసాగుతోంది.
మరొక నమ్మకం ప్రకారం పార్వతి దేవి శివుడిని వివాహం చేసుకోవాలని.. అడవిలో సంవత్సరాల పాటు తపస్సు చేసింది. అక్కడ ఆమె శివుడికి బిల్వ పత్రాలను సమర్పించి ప్రసన్నం చేసుకుంది. శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు. అప్పటి నుంచి శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించే సంప్రదాయం ఉంది. శివుడికి అది చాలా ఇష్టం.
పురాణ నమ్మకాలతో పాటు.. ఈ ఆకుకి సంబంధించిన ప్రయోజనాలు కూడా చాలా చెప్పబడ్డాయి. ఆయుర్వేద లక్షణాల గురించి చెప్పాలంటే దీనిలో యాంటీ ఫంగల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. బిల్వ ఆకులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. మారేడు పండు వేడిని చల్లబరుస్తుంది. కాలకుట విషం కారణంగా శివుని శరీరం మండుతున్న సమయంలో బిల్వ పత్రాలను ఆయనకు సమర్పించడానికి ఇదే కారణం. ఈ కారణాలన్నింటి వల్ల శివుడికి బిల్వ పత్రాలను సమర్పించే ఆచారం యుగాలుగా కొనసాగుతోంది. ఇది శివుడికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.