Andhra Pradesh: అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభ..  ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉండే గర్భగుడి, ఏపీలో ఎక్కడో తెలుసా!..

|

Apr 03, 2022 | 11:24 AM

Andhra Pradesh: భారతదేశం(India) ఆధ్యాత్మికతకు నెలవు. సనాతన ధర్మ విశిష్టతను తెలుపుతూ.. కొండ కోనల్లో అనేక ఆలయాలు. స్వయంభూ ఆలయాలు కొన్ని, మరికొన్ని మానవ నిర్మితాలు.. ఇంకొన్ని అలనాటి ఇంజనీరింగ్..

Andhra Pradesh: అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభ..  ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉండే గర్భగుడి, ఏపీలో ఎక్కడో తెలుసా!..
Bapatla Bhavanarayana Swamy
Follow us on

Andhra Pradesh: భారతదేశం(India) ఆధ్యాత్మికతకు నెలవు. సనాతన ధర్మ విశిష్టతను తెలుపుతూ.. కొండ కోనల్లో అనేక ఆలయాలు. స్వయంభూ ఆలయాలు కొన్ని, మరికొన్ని మానవ నిర్మితాలు.. ఇంకొన్ని అలనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే దేవాలయాలు. అలాంటి దేవాలయాలు ఎన్నో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. వాటిల్లో ఒక దేవాలయం చాలా భిన్నం… ఇక్కడ ఆలయంలో గర్భగుడి.. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటుంది. ఈ దేవాలయం అత్యంత పురాతనమైంది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల కథనం.. అంతేకాదు ఈ దేవాలయం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనమని చెబుతున్నారు. ఎందుకంటే ఈ దేవాలయంలోని గర్భగుడి చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది. అంతేకాదు స్వామివారి విగ్రహం మునికాళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. ఇటువంటి విగ్రహం భారత దేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు. అంతేకాదు మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ(Shanata Kesava) విగ్రహాన్ని ప్రతిష్టించారట.. ఇక్కడ స్వామివారిని ఏమి కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇన్ని విశిష్టతలతో  అలనాటి ఇంజనీర్ల ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వివరాల్లోకి వెళ్తే..

అతి ప్రాచీన దేవాలయం: ఆంధ్రప్రదేశ్ లోనేకాదు మొత్తం భారత దేశంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాలు భావనారాయణ స్వామి దేవాలయాలు. అలా ఐదు భావనారాయణ స్వామి ఆలయాల నిర్మాణం దాదాపు 1500 ఏళ్లకు పూర్వం జరిగిందని తెలుస్తోంది. వీటిని పంచ భావన్నారాయణ దేవాలయాలని అంటారు. పంచ భావన్నారాయ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఐదు క్షేత్రాలు వరుసగా బాపట్ల, పొన్నూరు, భావరేవరపల్లి, సర్పవరం, పట్టిసీమ. వీటిలో ముఖ్యమైనది బాపట్ల. ఇక్కడ నెలకొన్న భావనారాయణ స్వామి వల్ల ఈ ఊరిని మొదట భావపురి అని పిలిచేవారు. కాలక్రమంలో భావపురి కాస్తా బాపట్లగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడితో పాటు శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవారు, ఆళ్వారులు ఉన్నారు.

స్వామివారు కాలి వేళ్లపై నిలబడి: గర్భగుడిలోని మూలవిరాట్ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటారు. ఇలా ఓ దేవతా మూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించదు.

ఆలయం నిర్మాణ విశేషాలు: ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 594లో భావనారాయణుడి కోరిక మేరకు చోళ రాజైన క్రిమికంఠ చోళుడు నిర్మించినట్లు చారిత్రక కథనం.ఈ ఆలయంలో మరో విచిత్రం ఏమిటంటే… గర్భగుడి లోపలన చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది. ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఇక రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. అంతేకాదు ఇవి గజపాద (ఏనుగు కాలు) ఆకారంలో ఉండటం విశేషం. అంతేకాదు ఆలయ గర్భగుడి వెనుక పైకప్పు మత్స్య (చేప) ఆకారంలో కనిపిస్తుంది. ఈ చెప్పాను తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్మకం.

ఆలయభివృద్ధి: కాలక్రమంలో ఈ ఆలయాన్ని చోళ భూపాల దేవుడు, వీర ప్రతాప శూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగ చోళదేవరాజు, గజపతులు, దేవరాయులు అనంతరం అచ్చుత దేవరాయులు, సదాశివరాయులు ఎంతగానో అభివృద్ధి చేశారు.

జ్వాలా నరసింహ స్వామి విగ్రహం: ఆలయ నిర్మాణ సమయంలో పునాదుల కోసం తవ్వుతున్నప్పుడు జ్వాలా నరసింహ స్వామీ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని స్వామివారి ఆలయంలో పెట్టి పూజించేవారు అయితే అలా నరసింహ స్వామివారి విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి. ఈ విషయాన్నీ గమనించిన స్థానికులు రాజు క్రిమకంఠ చోళుడుని కోరారు. అప్పుడు ఆ రాజు పరిష్కరం కోసం పురోహితులను సంప్రదించగా జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయనని శాంతింపజేయాలని సూచించారు.
అప్పుడుస్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు.

విగ్రహం: జ్వాలా నరసింహుడి విగ్రహం కుర్చుని ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి. పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.

ఎలా చేరుకోవాలంటే: బాపట్లకు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుంచి బస్సు సర్వీలు ఉన్నాయి. అంతేకాదు బాపట్ల రైల్వే స్టేషన్ కు ఈ ఆలయానికి మధ్య దూరం కేవలం అరకిలోమీటరు. ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: Chilukuru Balaji: ఈ నెల 11 నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు.. పూర్తి వివరాలివే..

Late Night Party: మాజీ ఎంపీ కుమార్తె పబ్‌లో లేట్ నైట్ పార్టీ.. పోలీసుల అదుపులో ఆర్ఆర్ఆర్ సింగర్..టాలీవుడ్ ప్రముఖులు, డ్రగ్స్ స్వాధీనం