Ayodhya: అయోధ్యకు పోటెత్తున్న భక్తులు.. 17 నెలల్లో బాల రామయ్యని ఎంత మంది దర్శించుకున్నారో తెలుసా
కొన్ని వందల ఏళ్ల నిరీక్షణకు తెరపడి రామ జన్మ భూమి అయోధ్యలో రామయ్య కొలువుదీరాడు. దీంతో అయోధ్యపురిలోని బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏడాదిన్నర రికార్డు స్థాయిలో బాలరాముడ్ని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఎన్ని కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు?.

అయోధ్య రాములోరి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ లక్ష మందికి పైగా బాలరాముడ్ని దర్శించుకుంటున్నారు. హిందువుల దశాబ్దాల కల అయిన.. అయోధ్య రామమందిరం 2024 జనవరి 22న ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు ఐదున్నర కోట్ల మంది బాల రాముడ్ని దర్శించుకున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. అలాగే నాలుగున్నర లక్షల మందికి వీఐపీలు అయోధ్య రామాలయం సందర్శించారు. బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీల్లో ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పోర్ట్స్, సినిమా స్టార్స్, వివిధ రాజకీయ పార్టీల నేతల వరకు చాలామంది అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్నారు. బాలరాముడి సేవలో తరించారు.
విదేశీయులు కూడా భారీగా అయోధ్య రాముడిని దర్శించుకుని పూజలు చేశారు. వీరిలో ఎలన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కూడా ఉన్నారు. రోజూ లక్ష మంది దర్శనం చేసుకుంటున్నా.. టెంపుల్ ట్రస్ట్ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తుంది. భద్రతా పరంగా చర్యలు తీసుకోవడంతో.. భక్తులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించారు. హిందువులు ప్రతి ఒక్కరూ అయోధ్య రామాలయాన్ని సందర్శించాలనేది వారి డ్రీమ్ అంటున్నారు ఆలయ అధికారులు.
పండగల సమయాలు, వరుసల సెలవుల టైంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. అయినా.. ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం అంటోంది ఆలయ ట్రస్ట్. రోజూ స్వామివారికి పూజ కార్యక్రమాలు, అలంకరణ, నైవేధ్యం ఉంటాయని, అయోధ్య వచ్చిన ప్రతి భక్తుడు బాల రాముడ్ని చూసే వెళ్తారని అధికారులు అంటున్నారు. కేవలం 17 నెలల్లోనే ఐదున్నర కోట్ల మంది భక్తుల దర్శనం అంటే మామూలు విషయం కాదంటున్నారు. అయోధ్య రామయ్యపై భక్తితో.. లక్షలాదిగా తరలిరావడం సంతోషంగా ఉందంటున్నారు. ఇక ముందు కూడా స్వామివారి దర్శనం, పూజల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








