Sri Rama Navami: రామ నవమి వేడుకలకు ముస్తాబవుతున్న అయోధ్య.. సూర్య తిలకం ఎప్పుడంటే..

రామ జన్మ భూమి అయోధ్య నగరం శ్రీ రామ నవమికి ​​సిద్ధమవుతుంది. ఈసారి శ్రీ రామ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 2025 ఏప్రిల్ 6న జరగనున్న రామ నవమి వేడుకలకు సంబంధించిన షెడ్యుల్ ను ప్రకటించింది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు నవరాత్రి పండుగ సందర్భంగా రామ కథ నిర్వహించనున్నారు. అయోధ్యలో రామనవమి వేడుకలను భక్తులు భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Sri Rama Navami: రామ నవమి వేడుకలకు ముస్తాబవుతున్న అయోధ్య.. సూర్య తిలకం ఎప్పుడంటే..
Ayodhya Rama Navami

Edited By: TV9 Telugu

Updated on: Apr 03, 2025 | 12:50 PM

భారతదేశంలో గల్లీ గల్లీలోనూ శ్రీరామ నవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రామ జన్మ దినోత్సవం రోజున ప్రత్యేక పూజలు, మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. రామయ్య జన్మించిన అయోధ్యలో రామ నవమి వేడుకల కోసం రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించింది. చైత్ర మాసం మహానవమి తిధి హిందువులకు చాలా ముఖ్యమైన తిధిగా పరిగణించబడుతుంది. ఈ రోజున, లోక రక్షకుడు శ్రీ మహా విష్ణువు శ్రీ రాముడిగా అవతరించాడు. ఇది విష్ణువు ఏడవ అవతారంగా భావిస్తారు. దీనినే రామ నవమి అంటారు. శ్రీ రామ నవమిని హిందువులు ఎంతో పవిత్రమైన రోజుగా భావించి వేడుకలను జరుపుకుంటారు. ఇక బాల రామయ్యకు శ్రీ రామ నవమి రోజున అభిషేకం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు. తరువాత సూర్యకిరణాలు బాల రామయ్య నుదిటిపై 4 నిమిషాలు పడనున్నాయి. ఈ కార్యక్రమం అయోధ్య,ఫైజాబాద్‌లోని 50 కి పైగా స్క్రీన్‌లలో.. దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. స్థానికులు, భక్తులు ఆ దైవిక క్షణాన్ని వీక్షించడానికి అన్ని ఏర్పట్లు చేశారు.

త్రేతాయుగంలో చైత్ర మాసం నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు. అయోధ్యలో రామ జన్మోత్సవ వేడుకలను చూడడానికి రామయ్య భక్తులు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు. రామ్ లల్లా జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ ఏడాది శ్రీ రామ నవమి ఎప్పుడు?:

ఈ సంవత్సరం శ్రీ రామ నవమి ఏప్రిల్ 6న వచ్చింది. రాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. రాముడు సూర్యుని కుమారుడైన ఇక్ష్వాకు రాజు స్థాపించిన ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. కనుక శ్రీ రాముడిని సూర్యవంశస్థుడు అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

శ్రీ రామ నవమి వేడుకల షెడ్యూల్:

తేదీ: ఆదివారం, ఏప్రిల్ 6, 2025 (చైత్ర శుక్ల నవమి, విక్రమ్ సంవత్ 2081 అంటే ఏప్రిల్ 2025 లోని హిందూ నూతన సంవత్సరంలో చైత్ర మాసం శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు)

బాల రామయ్యకు అభిషేకం: ఉదయం 9.30 – 10.30

బాల రామయ్య ఆరాధన: ఉదయం 10.40 – 11.45.

బాల రామయ్య జననం: మధ్యాహ్నం 12 గంటలు

హారతి, సూర్య తిలక వేడుక: సూర్య కిరణాలు రామ్ లల్లా నుదిటిపై ప్రకాశించనున్నాయి. సూర్యనారాయణుడు తన కిరణాలతో వారసుడైన బాల రామయ్యకు తిలకం దిద్దనున్నాడు. భక్తులు తమ ఇళ్ల నుంచే టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ఈ అరుదైన క్షణాలను వీక్షించవచ్చు.

ఉదయం 10.40 నుంచి 11.45 గంటల వరకు శ్రీరాముడిని అలంకరించనున్నారు. ఈ సమయంలో భక్తులు దేవుడిని దర్శించుకుంటూనే ఉంటారు. రామయ్యకు నైవేద్యం సమర్పించడానికి ఉదయం 11.45 గంటలకు గర్భ గుడి తలుపులు మూసివేస్తారు. తరువాత మధ్యాహ్నం 12 గంటలకు బాల రామయ్యకు హారతి నిచ్చి తలుపులు తెరుస్తారు. తర్వాత సూర్య కిరణాలు రామ్ లల్లాపై తిలకంగా ప్రకాశించనున్నాయి. ఇలా దాదాపు 4 నిమిషాల పాటు ఉంటాయి. వాల్మీకి రామాయణం, రామచరితమానస పారాయణంతో పాటు, దుర్గా సప్తశతి 1 లక్ష మంత్రాలతో నైవేద్యాలు సమర్పిస్తారు.

సూర్య తిలకం ప్రాముఖ్యత:

దాశరధ తనయుడు శ్రీ రాముడు సూర్యవంశీయుడు. రామయ్య కుల దైవం ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు. చైత్ర మాసం శుక్ల పక్షం 9వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడని నమ్ముతారు. సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తికి మూలంగా.. గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో సూర్యుడు తన కిరణంతో భగవంతుడిని అభిషేకించినప్పుడు.. బాల రామయ్య ఆరాధనతో అతని దైవత్వం మేల్కొంటుందని భావిస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..