దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మండపాలు ఏర్పరచి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ క్షేత్రాలకు.. అమ్మవారి ఆలయాలకు నవరాత్రుల సందర్భంగా భక్తులు పోటెత్తుతున్నారు. శరన్నవరాత్రి వేడుకలంటే వెంటనే తెలుగువారికి వెంటనే గుర్తుకొచ్చే ఆలయం ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనక దుర్గమ్మ. ఈ క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రోజుకొక్క అవతారంలో అమ్మవారు పూజలను అందుకుంటున్నారు.
రేపు (ఆదివారం 2వ తేదీ) నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం.. చదువుల తల్లి సరస్వతి దేవి , అమ్మలగమ్మ కనక దుర్గమ్మ జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. కనుక ఈ రోజుని ఎంతో విశేషమైందిగా భావిస్తారు. రేపు అమ్మవారు సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
రేపు సరస్వతిదేవిని పూజిస్తే.. విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగదని.. సకల శుభాలు కలుగుతాయని భక్తుల విస్వాసం. కనుకనే నవరాత్రి వేడుకల్లో మూలా నక్షత్రం రోజున భక్తులు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..