Amarnath Yatra 2025: మంచు లింగంగా దర్శనం ఇచ్చిన శివయ్య.. అమర్‌నాథ్ యాత్ర షురూ.. మార్గాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటన
శంభో శంకర...! హరహర మహాదేవ ..! శివుడు మంచు కొండలపై నివాసముంటాడు...! అవసరమైతే తానే ఓ మంచుకొండగా మారతాడు ...! పిలవడమే ఆలస్యం హిమలింగేశ్వరుడిగా దర్శనమిచ్చి... కొన్ని రోజుల్లోనే కరిగినీరై భక్తుల చెంతకు చేరుకుంటాడని చెబుతుంటారు. అవును ఇప్పుడు ఆ లింగేశ్వరుడే భక్తుల కోసం కైలాసం వీడి మంచు లింగంగా అమర్నాథ్ వచ్చేశాడు. మరి భక్తుల కోసం తరలి చిన్న లింగమయ్యను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న శివయ్య అమర్‌నాథ్‌కు క్యూ కట్టారు.

భక్తులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది…! అత్యంత ప్రతిష్టాత్మక అమర్‌నాథ్ యాత్ర షురూ అయ్యింది. పహల్గమ్ ఉగ్రదాది నేపధ్యంలో మునుపెన్నడు లేని భారీ భద్రత నడుమ అమర్‌నాథ్‌కు కదిలారు భక్తజనం. హరహర మహదేవ నినాదాలతో కష్టాన్ని మరిచి ముక్కంటి సన్నిధికి చేరుకుంటున్నారు.
ఈ రోజుతో మొదలైన అమర్‌నాథ్ యాత్ర అగస్టు 9 రక్షాబంధన్‌తో ముగస్తుంది. అంటే సుమారు నలభై రోజులపాటు సాగనున్న ఈ యాత్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్భందీగా ఏర్పాట్లు చేశాయి. పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్న అమర్ నాథ్ యాత్ర జరుగుతుండటంతో అడుగడుగునా నిఘా పెంచారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇప్పటికే పలుసార్లు సెక్యూరిటీపై సమీక్షలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పహల్గామ్, బాల్తాల్‌లోనైతే చీమ చిటుక్కుమన్నా తెలిసేలా సెక్యూరిటీని ఫుల్ టైట్ చేశారు.
ఈసారి అమర్‌నాథ్ యాత్రికులకు RFID ట్యాగ్‌లు ఇచ్చారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరస్తులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇటు ఆర్మీతో పాటు బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీని పటిష్టం చేశారు. అలాగే యాత్ర మార్గాన్ని నో ఫ్లైజోన్‌గా ఇప్పటికే ప్రకటించారు. అమర్‌నాథ్ యాత్రకు ఈసారి హెలికాప్టర్ సర్వీసులను నిలిపివేశారు.
అమర్నాథ్ యాత్ర సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు నెలరోజులపాటు మాక్ డ్రిల్ నిర్వహించాయి. యాత్ర మార్గంలోనూ మాక్‌డ్రిల్ చేపట్టారు. ఒకవేళ ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపైనా మాక్‌డ్రిల్ నిర్వహించారు. పహల్గామ్ దాడి జరిగి రెండునెలలు దాటినప్పటికీ కశ్మీర్‌లో హైఅలర్ట్ కంటిన్యూ అవుతూనే ఉంది.
మొత్తంగా.. ఈసారి అత్యంత పకడ్భందీగా అమర్‌నాథ్ యాత్రకు ఏర్పాట్లు చేశారు. చీమచిటుక్కమన్నా క్షణాల్లో తెలిసిపోయేలా… ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించాయి. భక్తులకు కొండంత భరోసానిస్తున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








