Tribal Festival: అంటువ్యాధుల నివారణ కోసం శ్రావణ మాసంలో ఆదివాసీల పండగ.. కర్రగుర్రాలపై నడక
Tribal Festival in Adilabad: ఆధునికత పేరుతో చాలామంది తమ సంప్రదాయాన్ని పద్దతులను, కట్టుబొట్టు, పండగలు, ఫంక్షన్లు అన్నిటిలోను మార్పులు చేర్పు చేసుకుంటూ వచ్చారు. అయితే పచ్చని అడవుల మధ్య..
Tribal Festival in Adilabad: ఆధునికత పేరుతో చాలామంది తమ సంప్రదాయాన్ని పద్దతులను, కట్టుబొట్టు, పండగలు, ఫంక్షన్లు అన్నిటిలోను మార్పులు చేర్పు చేసుకుంటూ వచ్చారు. అయితే పచ్చని అడవుల మధ్య ఏ కల్మషం లేకుండా జీవించే ఆదివాసులు.. తమ సంస్కృతి, సంప్రదాయాలను తమ భావితరాలకు అందిస్తూనే ఉన్నారు. నవ నాగరిక సమాజపు కొత్త పోకడలకు దూరంగా తమ కట్టు, బొట్టూ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటు వస్తున్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు కారణమైన వర్షాకాలంలో శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో శ్రావణ మాసంలో ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ మాసంలో వారి కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు జీవనానికి అద్దంపట్టేలా ఉంటాయి. ప్రతి యేటా శ్రావణ మాసంలో ఆదివాసి గిరిజనులు కట్టు తప్పకుండా జరుపుకునే పండుగ కోడంగ్. దానికి మరో పేరే మారుగోళ్ల నడక.
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాలలో ఎక్కడ చూసినా అడవి బిడ్డలు వెదురు కర్రలతో తయారు చేసిన కర్ర గుర్రాలపై నడుస్తూ కనిపిస్తారు. పదడుగుల ఎత్తుండే కర్ర గుర్రాలపై టకటకా నడుస్తూ అందరిని అబ్బుర పరుస్తారు ఆదివాసీ చిన్నారులు. పిల్లలే కాదు ముసలి ముతక కూడా ఈ కర్రగుర్రాల నడకను సాగిస్తారు. ఇలా చేస్తే అంటురోగాలు రావని.. రోగాల భారీన పడరని వారి బలమైన విశ్వాసం.
చూడటానికి సర్కాస్ ఫీట్లుగా మనకు కనిపిస్తున్నా, ఎంతో పవిత్రంగా, సంప్రదాయంగా దేవుని ఆటగా పిల్లలు తప్పని సరిగా ఆడుతారు. గిరిజనులు ఈ ఆటను కొడన్ గా పిలుస్తారు. రెండు పొడవైన వెదరు బొంగులకు మద్యలో పాదాలు పెట్టేందుకు అనువుగా తాడుతో రెండుగా చీల్చిన ఒకటి రెండు ఫీట్ల వెదురు బొంగును అడ్డంగా కర్రలకు అమర్చుతారు. ఆ తరువాత దేవుడికి ప్రార్ధించి ఈ వెదురు బొంగుల ఆదారంగా గ్రామంలో అటు ఇటు తిరుగుతారు. వందల ఏళ్ల క్రితం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని గిరిజనులు ఈరోజుకు కూడా పాటిస్తున్నారు.
పొలాల అమావాస్య రోజు ఈ వెదురు కర్రలను పట్టుకొని “జాగేయ్ మాతరి జాగేయ్” అంటూ నినాదాలు చేస్తూ.. గ్రామ శివారులోని పొలిమెర దేవతకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ కర్ర గుర్రాలను శివ్వా అనే చెట్టు వద్ద ఉంచి.. తమ వెంట తీసుకువచ్చిన నైవేద్యాలను ఓ తొట్టిలో ఒకేచోట వేసి పరిశీలిస్తారు. అలా తీసుకు వచ్చిన నైవేద్యం బాగుంటే తమకు ఎలాంటి హాని జరగదని, తమ గ్రామం బాగుంటుందని.. ఒకవేళా ఈ నైవేద్యం పాడైతే తమకు తమ గ్రామానికి ఎదైనా కీడు జరగవచ్చని నమ్ముతారు. నైవేద్యాలు సమర్పించిన తరువాత అందరు కలిసి చివరి మొక్కులు చెల్లిస్తారు. అనంతరం తిరిగి తమ తమ ఇళ్ళకు పయనమవుతారు. తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో దారిలో కనిపించే వనమూలికలు టేకు పూలు వెదురు ఆకులు, మోదుగు ఆకులు ఇలా కనపడ్డ ప్రతి పచ్చగడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులో ఉంచుతారు. అలా తెచ్చిన వాటిని గ్రామంలో ఏదైనా కీడు కలిగిన సమయంలో పొగవేస్తారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని ఆదివాసీల బలమైన నమ్మకం.
Also Read: Funny Cat Video: ఆవు పొదుగు నుండి డైరెక్ట్‌గా పిల్లి నోట్లోకి పాలు .. ఫన్నీ వీడియో వైరల్