ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు చెబుతుంటారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలోనూ వాస్తు ఉంటుందని సూచిస్తుంటారు. ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు సరైన దిశలో ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటిలో ఇంట్లో ఉండే అద్దం ఒకటి.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజులో మనం కచ్చితంగా చూసే వస్తువుల్లో అద్దం ప్రధానమైంది. అలాంటి అద్దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెడితే దుష్ఫ్రభావాలు ఎదుర్కోక తప్పదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అద్దాన్ని ఇంట్లో సరైన దిశలో పెట్టకపోతే ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని సూచిస్తున్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడంలో అద్దం కీలకపాత్ర పోషిస్తుంది. అద్దాన్ని సరైన దిశలో ఉంచితే కలిగే లాభాల గురించి వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఇంతకీ ఇంట్లో అద్దం ఏ దిశలో ఉంటే, ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
వాస్తు నియమాల ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. తూర్పు, ఉత్తర గోడలకు అద్దాలను పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇక దక్షిణం, పశ్చిమ దిశల్లో అద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒకవేళ ఈ దిశల్లో అద్దాన్ని ఏర్పాటు చేస్తే ఇంట్లో అశాంతి నెలకొంటుందని సూచిస్తున్నారు. ఇక అద్దం ఆకారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
అద్దం ఆకారం వృత్తాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలని సూచిస్తున్నారు. గోడి గుడ్డు లేదా గోళాకారంలో అద్దాలు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక బెడ్ రూమ్‌లో ఉండే అద్దం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత వరకు బెడ్ ముందు అద్దం ఉండకుండా చూసుకోవాలి. ఇక లాకర్ ముందు అద్దం ఉంచడం శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆర్థికంగా బలోపేతమవుతారని శాస్త్రం చెబుతోంది. ఉత్తర దిశలో అద్దాన్ని ఏర్పాటు చేయడం అన్నింటికంటే శ్రేయస్కరమని చెబుతున్నారు. ఉత్తర దిశ కుబేరుడికి కేంద్రమని నమ్మతుంటారు. ఈ కారణంగానే ఈ దిశలో అద్దం ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..