Ramzan–Eid-ul-Fitr 2021: ముస్లింలు జరుపుకునే ‘ఈద్’కి రంజాన్ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. సర్వ మానవాళికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రంజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం,పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశారు. చేసిన తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే మహత్తర శుభదినం ఈద్.
ఈ ఏడాది ఈద్ ఉల్ ఫితర్ పండుగను భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇవాళ రంజాన్ పర్వదిన వేడుకలు జరగుతున్నాయి. 30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు గురువారంతో ముగిసింది. నిన్న నెలవంక దర్శనం అనంతరం ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, ఒక్క సౌదీ దేశాల్లో మాత్రం గురువారంమే పండుగను నిర్వహించారు. సౌదీ ఆరేబియాతో పాటు దుబాయ్, కువైట్ దేశాల్లో రంజాన్ వేడుకులు గురువారమే జరుగుతున్నాయి. ఇవాళ అన్ని దేశాల్లో పర్వదినాన్ని నిర్వహించనున్నారు.
ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాదిగా కేసులు, వేలాది మంది మహమ్మారి ధాటికి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని మతపెద్దలు, పలువురు ముస్లిం నాయకులు సూచిస్తున్నారు. సామూహిక ప్రార్థనల వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని ఎవరి ఇళ్లల్లో వారే చేసుకోవాలని పేర్కొంటున్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రార్థనలు నిర్వహించవద్దని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఉత్తర్వులు జారీ చేశాయి.
ముఖ్యంగా రంజాన్ పండుగ అంటే.. మన హైదరాబాద్ కొత్త రూపును సంతరించుకుంటుంది. అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు అంతా బోసిపోతోంది. లాక్‌డౌన్ నిబంధనల కారణంగా ముస్లింలు మసీదులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సామూహికంగా జరుపుకోవల్సిన పండుగ సామాజిక దూరం పాటించి చేసుకోవల్సి వస్తుంది. ఇకరినొకరు ఈద్ శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని సమస్య వచ్చింది. ఇంట్లోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సి వస్తోంది.
గత వందేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. కాకపోతే 112 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఇళ్లలోనే ఎవరికి వారు ప్రార్థనలు చేసుకున్నారు. అప్పుడు మూసీ వరదలు రావడంతో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా హంగు ఆర్భాటం లేకుండా రంజాన్‌ను జరుపుకున్నారు. 1908 సెప్టెంబరులో మూసీ వరదలు వచ్చాయి. దాదాపు 17 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మూసీ వరద తాకిడికి హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్ , ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్ వంతెనలు తెగిపోయాయి. దీంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దాదాపు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేల మట్టమయ్యాయి. మూసీ వరద బీభత్సానికి అఫ్జల్‌గంజ్ ప్రభుత్వాస్పత్రి పూర్తిగా కొట్టుకుపోయింది. కనీసం ఎనిమిది వేల కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి.
అయితే, మూసీ నదికి వరద పోటెత్తిన సమయంలోనే రంజాన్ మాసం ప్రారంభమైంది. వరదలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితిలేదు. రంజాన్ నెల ముగిసే నాటికి కూడా జనం ఇళ్ల నుంచి బయటకి రాలేకపోయారు. దీంతో పండుగ సంబురాలను పక్కనబెట్టి ఆ డబ్బును వరద బాధితులకు అందజేశారు. అది జరిగి ఇప్పటికి 112 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా దెబ్బకు భయపడి ప్రజలు 2 నెలలుగా గడప దాటడంలేదు. ఒకవైపు, ప్రభుత్వం ఆంక్షలు, మరోవైపు కరోనా వైరస్ విజృంభణ.. దీంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనసమర్థ ప్రదేశాల్లోకి వస్తే ఎక్కడ వైరస్ అంటుకుంటుందోనని గుబులు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడూ ప్రార్థనలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకుని సామాజిక దూరం పాటిస్తూ రంజాన్ పవిత్ర పండుగను జరుపుకుంటున్నారు.
Read Also… మహిళలు మీ హృదయం పదిలం..! ఈ ఆరు విషయాలను కచ్చితంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి..