రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్ సభ్యుల నియామకంపై సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. నియామక కమిటీకి సీఎం జగన్ నేతృత్వం వహించారు. కమిటీలో శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ , హోంమంత్రి, మండలి, శాసనసభ ప్రతిపక్ష నేతలు ఉన్నారు. మండలి చైర్మన్ షరీఫ్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హోంమంత్రి సుచరిత సమావేశానికి హాజరవగా… ఉభయ సభల విపక్ష నేతలు చంద్రబాబు, యనమల సమావేశానికి గైర్హాజరయ్యారు.
టీడీపీ గైర్హాజరు కావడంపై యనమల రామకృష్ణుడు స్పందించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వ్యక్తుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగినప్పుడు అతి తక్కువ ఖర్చుతో న్యాయం పొందే అవకాశం మానవ హక్కుల కమిషన్ కల్పిస్తుంది. కానీ నేటి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతర్ చేస్తూ మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసిందని యనమల ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో అరాచాకాలు, విద్యంసాలు, ప్రజా హక్కుల ఉల్లంఘన తీవ్రమైందని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కుతూ.. దాడులు, దౌర్జన్యాలు, అకృత్యాలతో నెత్తుటి పాలన సాగిస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను సైతం భంగపరుస్తున్నారు. రాష్ర్టంలోని ప్రజలు స్వేచ్చగా మసలుకునే అవకాశం లేకుండా పోయింది. తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేసే పరిస్థితి లేదని విమర్శించారు.
అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న మహిళపై పోలీసులతో దాడులు చేయించి, అక్రమ కేసులు పెట్టారు. మాస్కు అడిగినందుకు నడిరోడ్డుపై ఓ వైద్యుడిపై దాడి చేసినపుడు, ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత యువకుడిని శిరోముండనం చేసినపుడు, మద్యం మాఫియాను ప్రశ్నించినందుకు వేధించి ఓ దళిత యువకుడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వారి హక్కుల్ని హరించారని యనమల ధ్వజమెత్తారు.
స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే హక్కు కూడా లేకుండా.. బెదిరింపులు దిగారు. భయపెట్టారు. ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్ధులు పోటీలో లేకుండా చేశారు. ఎదురించి పోటీలో నిలబడిన వారిని కిడ్నాప్ చేయడం ద్వారా.. ప్రజాస్వామ్య బద్దంగా దక్కిన హక్కుల్ని కాలరాశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో బలహీనవర్గాల ప్రజల హక్కుల్ని హరించి వారిని ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేస్తోందని యనమల దుయ్యబట్టారు.
ఒకవైపు ప్రజాస్వామ్య స్పూర్తిని నీరుగారుస్తూ.. ప్రజా హక్కుల్ని హరిస్తూ.. నీరో చక్రవర్తిలా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా బహిస్కరిస్తున్నామని యనమల రామకృష్ణుడు చెప్పారు. మానవ హక్కులన్నా, రాజ్యాంగ హక్కులన్నా జగన్మోహన్‌రెడ్డి ఏమాత్రం గౌరవం లేదన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పనులకు.. చెప్తున్న మాటలకు కనీసం పొంతన లేదని విమర్శించారు. అలాంటి వ్యక్తి పౌర హక్కులంటూ నేడు సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు యనమల.
యనమలకు విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా కౌంటర్
కాగా యనమల ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. “…. ఈ మేకవన్నె పులి, … ఈ గుంట నక్క” అని ఎన్టీఆర్ పేర్కొన్న చంద్రబాబు నాయుడ్ని, వెన్నుపోటుకు స్పీకర్‌గా ఉపయోగపడిన యనమలను మానవహక్కుల సమావేశానికి రమ్మంటే వారు ఎందుకు వస్తారు చెప్పండి? తమను మానవులుగా గుర్తించటం వీరిద్దరికీ ఏనాడూ ఇష్టముండదు మరి! అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
“…. ఈ మేకవన్నె పులి, … ఈ గుంట నక్క” అని ఎన్టీఆర్ పేర్కొన్న చంద్రబాబు నాయుడ్ని, వెన్నుపోటుకు స్పీకర్‌గా ఉపయోగపడిన యనమలను మానవహక్కుల సమావేశానికి రమ్మంటే వారు ఎందుకు వస్తారు చెప్పండి? తమను మానవులుగా గుర్తించటం వీరిద్దరికీ ఏనాడూ ఇష్టముండదు మరి!
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 17, 2021
సచివాలయం వద్ద అమరావతి రైతుల నిరసన
చాలా రోజుల తర్వాత సచివాలయానికి సీఎం జగన్ రాక సందర్భంగా మందడం గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతుల దీక్ష శిబిరం వద్ద రైతులు వెనక్కి వెళ్లాలని పోలీసులు కోరారు. అయితే శిబిరం ముందు నిలబడి సీఎం వెళ్లే వరకు రైతులు అమరావతి నినాదాలు చేశారు. రైతులు బయటకు రాకుండా పోలీసులు అడ్డు గోడగా నిలిచారు.
Read More: