హైదరాబాద్: అవసరమైతే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత పరిశీలించి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారత దేశం మొత్తాన్ని ఏకం చేస్తానని ఆయన అన్నారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లో టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావ సభలో ఆయన మాట్లాడారు.
ఇక్కడి ఎంపీ స్థానాలతో పాటు ఇంకా 150కి పైగా ఎంపీ స్థానాలను కూడగట్టి జాతీయ స్థాయిలో కీలకం అవుతామని అన్నారు. అందుకు చేయాల్సిదంతా చేశానని, ఎవరెవరికి ఏం చెప్పాలో అన్నీ చెప్పి ఉంచానని అన్నారు. దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ రావాలి. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరి వల్లనే అన్నిరంగాల్లో దేశం వెనకబడి ఉంది అని కేసీఆర్ అన్నారు.
భారతదేశంలో 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇన్ని నీళ్లు మనకుంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న 40 కోట్ల ఎకరాల భూమికి అందించలేకపోతున్నారు. సరిగ్గా పారిస్తే 40,000 టీఎంసీలు సరిపోతాయి. 30,000 టీఎంసీలు మిగులుతయి. 73 ఏళ్లు గడిచి పోయినాయి.. వీరిద్దరి పాలనలో తాగు, సాగు నీళ్లు లేవు. మీకు తెలివి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా అని కేసీఆర్ అన్నారు.