ఏపీలో కియా కార్ల టాపిక్ హాట్‌గా మారింది. ఏపీలో తయారైన తొలికారు కియా. అనంతపురం ప్లాంట్ నుంచి తయారు చేసిన సెల్టో కారును ఇప్పుడు గ్రాండ్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అయితే ఈ కియా ఘనత తమదంటే తమదంటూ నేతలు కామెంట్లు మొదలుపెట్టారు. ఈ ఏడాది జనవరి 29న ఇదే కియా మోటార్స్‌కి చెందిన ఇదే అనంతపురం ప్లాంట్‌లో తయారైన తొలి కారుతోనే ట్రయిల్ రన్ చేశారు నాటి సీఎం చంద్రబాబు. స్వయంగా కారు నడుపుతూ బాబు ఫోటోలకు ఫోజుచ్చారు. అయితే అప్పుడు బాబు లాంఛ్ చేసింది కియా ఫస్ట్ కారా… లేదా ఇప్పుడు జగన్ రిలీజ్ చేసిందే తొలి కియా కారా.. అనేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతీ కంపెనీకి తొలి కారు అంటూ ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు మార్కెట్లోకి విడుదల అయిన సెల్టో కారే తొలి కారు అయితే… మరి నాడు చంద్రబాబు ట్రయిల్ రన్ చేసిన కారు ఎక్కడ తయారైంది అన్న చర్చ మొదలైంది. కియా మోటార్స్ తొలి కారు విడుదల కాగానే…మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. కష్టపడేది ఒకరు…రిబ్బన్ కట్ చేసేది ఇంకొకరు అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ మీద సెటైర్ వేశారు. దీంతో అటు వైసీపీ నేతలు డైరెక్ట్‌గానే విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా కియా మీద ట్వీట్ చేశారు. దేశంలోనే మొదటి కియా ప్లాంటు నుంచి తొలి కారు విడుదల సందర్భంగా ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు కూడా ఇదే తొలి కారు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.