VK Sasikala: అన్నాడీఎంకే నేతల మధ్య కుమ్ములాటలు.. పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించాలని తీర్మానం

| Edited By: Janardhan Veluru

Jul 11, 2021 | 12:18 PM

VK Sasikala - Tamilnadu Politics: తమిళనాట అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. పార్టీ పగ్గాలను బహిష్కృత నేత శశికళకు అప్పగించాలన్న డిమాండ్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి.

VK Sasikala: అన్నాడీఎంకే నేతల మధ్య కుమ్ములాటలు.. పార్టీ పగ్గాలు శశికళకు అప్పగించాలని తీర్మానం
Sasikala
Follow us on

తమిళనాట అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. పార్టీ పగ్గాలను బహిష్కృత నేత శశికళకు అప్పగించాలన్న డిమాండ్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. శశికళకు మద్ధతుగా కొందరు కింది స్థాయి నేతలు బహింగ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో శశికళకు మద్ధతిచ్చే పార్టీ నేతల ఆస్తులపై దాడులు ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా ట్యూటికోరిన్ జిల్లాలో అన్నాడీఎంకే నేతలు రెండుగా చీలిపోయారు. పార్టీ సారథ్య పగ్గాలను వీకే శశికళకు అప్పగించాలంటూ ఆ జిల్లాలోని కోవిల్‌పట్టి అన్నాడీఎంకే విభాగం తీర్మానం చేసింది. పలు విభాగాలకు చెందిన అన్నాడీఎంకే నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల శశికళతో ఫోన్‌లో మాట్లాడినందుకు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శశికళతో మాట్లాడిన నేతలను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతూ తీర్మానం చేశారు. అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

మరికొన్ని జిల్లాలోనూ శశికళకు పార్టీ సారధ్యపగ్గాలు అప్పగించాలని కొందరు అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో అసమ్మతి నేతలు, శశికళ మద్ధతుదారులను బుజ్జగించేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ముందు ముందు శశికళకు మద్ధతు పెరిగితే వారిని కట్టడి చేయడం ఈ.పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు కష్టతరంగా మారే అవకాశముంది. వాస్తవానికి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య నెలకొన్న విభేదాలను సొమ్ము చేసుకుని పార్టీలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని శశికళ ఉవ్విళ్లూరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని కోసం సరైన సమయం కోసం ఆమె వేచిచూస్తున్నారు. పార్టీని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు ఆగస్టు మాసం నుంచి శశికళ వ్యూహాత్మక అడుగులు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పార్టీ తమ చేతి నుంచి శశికళకు వెళ్లిపోకుండా పళనిస్వామి, పన్నీర్ సెల్వం, ఇతర సీనియర్ నేతలు, మంత్రులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

Also Read..

Funny Video: ఈ బుడ్డోడు డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. స్టెప్పులతో ఇరగదీశాడు.. వైరల్ వీడియో..

Sirisha Bandla: నేడు రోదసిలోకి తెలుగమ్మాయి.. అరుదైన ఘనత సాధించనున్న బండ్ల శిరీష..