Anandayya corona medicine : సాఫీగా సాగిపోయే కార్యక్రమాన్ని గందరగోళం చేయకండి : ఏపీ సర్కారుకి సోమిరెడ్డి విజ్ఞప్తి
Somireddy Chandramohan Reddy : ఆనందయ్య మందు పంపిణీని ఆపేది మీరే.. ప్రారంభిస్తున్నామని ప్రకటించేది మీరే.. తిరిగి లాఠీచార్జీ చేసేది మీరేనా..?
Somireddy Chandramohan Reddy : ఆనందయ్య మందు పంపిణీని ఆపేది మీరే.. ప్రారంభిస్తున్నామని ప్రకటించేది మీరే.. తిరిగి లాఠీచార్జీ చేసేది మీరేనా..? అంటూ జగన్ ప్రభుత్వాన్ని.. అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సాఫీగా సాగిపోయే కార్యక్రమాన్ని గందరగోళం చేయకండని అధికారులు, ప్రభుత్వానికి సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. “కరోనాను తగ్గించే ఆయుర్వేద మందును ఆనందయ్య రోజుకు 5 వేల నుంచి 10 వేల మందికి ఇస్తూ వచ్చారు.. ప్రభుత్వం నాలుగైదు రోజులుగా మందు పంపిణీని ఆపివేసింది.. ఇంతలో ఎమ్మెల్యే రేపటి నుంచి ప్రారంభిస్తున్నానని నిన్న ప్రకటించారు.. అది మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఈ రోజు ఎమ్మెల్యే వెళ్లి రిబ్బన్ కట్ చేసినట్లు ప్రారంభించారు. దీంతో ఇవాళ ఏకంగా 40 వేల నుంచి 50 వేల మంది వరకు వచ్చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పి లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంబులెన్స్ లో ఉన్న రోగులకు కూడా మందు దొరకడం కష్టమైపోయింది. అసలు ఆయుర్వేదం మందు పంపిణీని ఎందుకు ఆపాల్సివచ్చింది.” అని సోమిరెడ్డి నిలదీశారు. తిరిగి ప్రారంభించేటప్పుడు ఒక్క పద్ధతి ప్రకారం ఎందుకు చేయలేకపోయారన్న ఆయన.. ఆనందయ్య రోజుకు ఎంత మందికి మందు ఇవ్వగలడో ఆలోచించారా అంటూ అడిగారు. టైమ్ స్లాట్ ప్రకారం కూపన్లు ఇచ్చే అంశం ఎందుకు పరిశీలించలేకపోయారని ప్రభుత్వ పెద్దల్ని సోమిరెడ్డి ప్రశ్నించారు. ” హైదరాబాద్ లో బత్తిన సోదరులు ఇచ్చే చేప మందును కూడా లక్షల మంది స్వీకరిస్తారు.. అందుకు తగినట్లుగా ప్రభుత్వమే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు చేస్తుంది.. నిర్వాహకులు, అధికారులు సమష్టిగా పనిచేసి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తారు.. అలాంటి చర్యలు ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోయారు.. ఆపడం మీరే…ప్రారంభిస్తామని ప్రకటించడం మీరే..లాఠీచార్జీ చేయడం మీరేనా.? ప్రజల ప్రాణాలను కాపాడలనే మంచి ఉద్దేశంతో ఆనందయ్య ఉచితంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గందరగోళం చేసేశారు.. పెద్దాసుపత్రి క్యాజువాలిటీ బ్యాక్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఈ రోజు వచ్చింది.. ఆస్పత్రిలో చేసే వైద్యం కన్నా ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేదం మందుపై ప్రజలకు నమ్మకం పెరిగింది.. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజానీకం ఈ రోజు క్రిష్ణపట్నం వచ్చేశారు. మళ్లీ ఇప్పుడు ఆపారు.. ఐసీఎంఆర్ బృందం పరిశీలన అంటున్నారు.. ఇప్పటికైనా ఆనందయ్యతో చర్చించి రోజుకు ఎంత మందికి మందు అందించగలరో అంచనాలు రూపొందించండి.. నెల్లూరులో ఏసీ స్టేడియం లేదా వీఆర్సీ మైదానంలో, లేదంటే కృష్ణపట్నంలోనే ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయండి.. కూపన్లు అందజేసి టైమ్ షెడ్యూల్ ప్రకారం మందు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.. సాఫీగా సాగిపోతున్న మందు పంపిణీ కార్యక్రమాన్ని గందరగోళంగా మార్చడం తగదని విన్నవించుకుంటున్నాను” అని సోమిరెడ్డి స్పష్టం చేశారు.