CM KCR: టార్గెట్ బీజేపీ.. రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్న సీఎం కేసీఆర్.. తమిళనాడు పర్యటన వెనుక..

|

Dec 13, 2021 | 11:16 AM

Telangana CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. తమిళనాడులో రెండు రోజులపాటు సీఎం కేసీఆర్ టూర్ సాగనుంది.

CM KCR: టార్గెట్ బీజేపీ.. రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్న సీఎం కేసీఆర్.. తమిళనాడు పర్యటన వెనుక..
Follow us on

Telangana CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. తమిళనాడులో రెండు రోజులపాటు సీఎం కేసీఆర్ టూర్ సాగనుంది. ముందుగా  శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరంగ ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీరంగం నుంచి చెన్నై చేరుకోనున్న సీఎం కేసీఆర్.. రేపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​తో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తిరుచిరాపల్లి వెళతారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి రంగనాథస్వామిని దర్శించుకోనున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై దిక్కార స్వరం వినిపిస్తున్న కేసీఆర్.. దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహారించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే స్టాలిన్‌ని కేసీఆర్ కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో స్టాలిన్‌తో కేసీఆర్ జాతీయ రాజకీయ అంశాలతో పాటు ఏయే ఇతర అంశాలపై చర్చించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలిచే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదంటున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీని పలు రాష్ట్రాల్లో బలోపేతం చేయడం, భావసారూప్య పార్టీలను కలుపుకుని వెళ్లడంపై దృష్టిసారించారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌ కూడా పలు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ స్థానాల్లో గెలిచే అవకాశముందన్న సర్వేల ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. గోవాలోనూ గట్టి పోటీ ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.  అటు తృణాముల్ కాంగ్రెస్‌కు మద్ధతిస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. టీఆర్ఎస్‌కు కూడా వ్యూహాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీకానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read..

West Godavari: పెళ్లికి వెళ్లి వచ్చేసరికి.. ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్

Parliament: 11వ రోజుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఇవాళ రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర సర్కార్!