PM Narendra Modi holds high level meeting : కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడికి నాలుగు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కొంచెంసేపటి క్రితం ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా, దాని లభ్యతకు సంబంధించి ఉన్నత స్థాయి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ అన్ని రాష్ట్రాల్లోనూ సులభంగా లభ్యమయ్యే మార్గాలపై ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచేందుకు గత కొన్ని వారాలుగా చేపట్టిన ప్రయత్నాలను అధికారులు మోదీకి వివరించారు. కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ విషయంలో బహుముఖంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రధాని నొక్కి వక్కాణించారు. ఆక్సిజన్ కోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ ను గుర్తించడానికి, తదనుగుణంగా తగినంత సరఫరాను నిర్ధారించడానికి రాష్ట్రాలతో సమన్వయంతో.. విస్తృతమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. ఇప్పుడున్న రోజుకు 6,785 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు బదులుగా ఏప్రిల్ 21 నుండి 20 రాష్ట్రాలకు రోజుకు 6,822 మెట్రిక్ టన్నులను కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, గత కొన్ని రోజులుగా ప్రైవేట్, పబ్లిక్ స్టీల్ ప్లాంట్లు, పరిశ్రమలు, ఆక్సిజన్ తయారీదారుల సహకారంతో పాటు అనవసరమైన వాటికి ఆక్సిజన్ సరఫరా నిషేధించడం ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ లభ్యత రోజుకు సుమారు 3,300 మెట్రిక్ టన్నుల మేర పెరిగిందని ఈ సమావేశంలో అధికారులు ప్రధానికి వెల్లడించారు. ఇక, వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా సజావుగా, అడ్డంకులు లేకుండా జరిగేలా చూడాలని మోదీ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి ఇంకా.. సరఫరాను పెంచడానికి వివిధ రకాలైన వినూత్న మార్గాలను కూడా అన్వేషించాలని ప్రధాని ఆయా మంత్రిత్వ శాఖలను కోరారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Megastar Chiranjeevi: కీలక నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచితంగా టీకా…
Superstar Mahesh Babu టాలీవుడ్‌లో కరోనా కలకలం… సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు..!