
బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి కూచ్ బిహార్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఈ జిల్లాలో సీఐఎస్ఎఫ్ దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు గవర్నర్ గురువారం ఇక్కడికి రాగా స్థానికులు నల్లజెండాలతో స్వాగతం పలికారు. కొన్ని చోట్ల ఆయన కాన్వాయ్ ని అడ్డగించారు. ఇన్నాళ్లకు మా దుస్థితిని చూడడానికి వచ్చారా అని మహిళలు నిలదీశారు. వారి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, ఇలాంటి పరిస్థితిని తాను ఏ మాత్రం ఊహించలేదని ఆయన ఆ తరువాత వ్యాఖ్యానించారు. పోలీసులంటే వీరు భయపడిపోతున్నారని, వీరి ఇళ్లను లూటీ చేశారని, ఇది ప్రజాస్వామ్య వినాశనమేనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు తమ ఇళ్ళు వదిలి అడవుల్లో ఉంటున్నారని, గూండాలు మళ్ళీ వఛ్చి తమపై ఎక్కడ దాడి చేస్తారోనని బెంబేలెత్తిపోతున్నారని జగ దీప్ ధన్ కర్ అన్నారు. వీరి భయం చూసి తాను దిగ్భ్రాంతి చెందానన్నారు అయితే సీఎం మమతా బెనర్జీ ఈ గవర్నర్ తీరుపై ఫైరయ్యారు. ఇలాంటి జిల్లాలకు మీరు జరపాలనుకుంటున్న పర్యటనలు నిబంధనలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆమె ఓ లేఖలో ఆరోపించారు. ఫీల్డ్ విజిట్లు చేయాలన్న మీ అర్ధాంతర నిర్ణయాలకు స్వస్తి చెప్పండి అని ఆమె కోరారు.
అయితే రాజ్యాంగం ప్రకారం తాను ఏఈ విజిట్లు చేస్తున్నానని, ప్రజల ఆందోళనను తెలుసుకోదలిచానని గవర్నర్ ఆమెకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా… కూచ్ బీహార్ జిల్లాలో ఈయన వెంట బీజేపీ ఎంపీ నితీష్ ప్రమాణిక్ ఉండడం విశేషం..
మరిన్ని ఇక్కడ చూడండి: ఇండియాకు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్, వచ్చే వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి, నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె. పాల్ వెల్లడి
Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,693 కరోనా కేసులు.. 33 మంది మృతి..