మాకు మద్దతిస్తే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం.. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల భేటీ

|

Mar 03, 2021 | 5:42 PM

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు జిల్లాల్లోనే మకాం వేశారు. తమ అభ్యర్థులను గెలిపించేందుకు..

మాకు మద్దతిస్తే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం.. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల భేటీ
Follow us on

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు జిల్లాల్లోనే మకాం వేశారు. తమ అభ్యర్థులను గెలిపించేందుకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ అభ్యర్థి వాణిదేవి గెలుపు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కి మద్దతుగా నిలవాలని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు.

బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవో, టిజిఓ, రెవెన్యూ, టీచర్స్,రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానిది-ఉద్యోగులది పేగుబంధం లాంటిదని దాన్ని అలాగే పదిలంగా ఉంచుకుందామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.మీ సమస్యలు అన్నింటి పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు.మీ న్యాయమైన డిమాండ్లను అన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో పరిష్కరిస్తారన్నారు.పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి గెలిపించాలని అభ్యర్థించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నారని పీఆర్సీ పై త్వరలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి టిఆర్ఎస్ పార్టీకి,ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యోగ సంఘాలు వెన్నుదన్నుగా ఉంటున్నారని అన్నారు. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు.టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి కి మద్దతు తెలిపి గెలిపించాలని ఉద్యోగ సంఘాల నాయకులను ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌:

తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. చాలాకాలంగా ఎన్నికలపై కేటీఆర్ ని రంగంలోకి దించిన కేసీఆర్ ఈసారి ఎన్నికలపై ఆయన నేరుగా ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఎదురైన అనుభవాల దృష్ట్యా, ఈసారి అటువంటి పరిస్థితి ఉండకూడదని ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత వెంటనే రానున్న ఎన్నికలపై కూడా ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు.

హైదరాబాద్ – రంగారెడ్డి – ఉమ్మడి మహబూబ్ నగర్ , నల్గొండ – వరంగల్ – ఖమ్మం రెండు సీట్లు కైవసం చేసుకోవాలని కెసిఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏ మాత్రం అలసత్వం , నిర్లక్ష్యం వహించవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇటీవల పట్టభద్రుల ఎన్నికలతో పాటుగా కార్పొరేషన్ ఎన్నికల పై గురి పెట్టిన గులాబీ బాస్ ఆయా జిల్లాల ముఖ్యనేతలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. అర్హులందరికీ ఓటు నమోదు చేయించి పార్టీ అభ్యర్థుల విజయానికి సమాయత్తం చేయాలని కేసీఆర్ వారికి సూచించారు.

గతంలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించడం అలాగే ఉమ్మడి మెదక్ – కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విజయం సాధించడంతో గులాబీ బాస్ ఖంగు తిన్నారు. ఈసారి ఎలాగైనా పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలను లైట్ తీసుకోకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

ఈసారి పట్టభద్రుల కోటాలో శాసనమండలిలో అడుగు పెట్టడం కోసం రాజకీయ పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు సైతం బరిలోకి దిగారు. ఈసారి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలోకి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా దిగుతున్న నేపథ్యంలో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.