ఆషాడ మాసం వెళ్లి శ్రావణం రావడంతో.. బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచింది. మొన్న మాజీ ఎంపీ వివేక్ చేరిన విషయం తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా సైలెంట్ అయిన మాజీ మంత్రి, మోత్కుపల్లి నరసింహులను తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. మోత్కుపల్లి ఇంటికి వెళ్లిన వీళ్లిద్దరూ దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. బీజేపీ ఆహ్వానానికి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
కాగా, ఇటీవలే టీడీపీకి మోత్కుపల్లి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయారు. అనంతరం ఆయన కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల ఆహ్వానంతో.. మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలంగా మారనున్నారు. బీజేపీలో ఆయన చేరితే తెలంగాణలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కమలం నేతలు భావిస్తున్నారు.