Bandi Sanjay : కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర వాటాను రక్షించాలంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకోసం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కులు కాపాడాలంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై తప్పనిసరి అన్నారు. జగన్, కేసీఆర్ ఇద్దరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలని పనిచేయడం లేదని ఆరోపించారు. ఇద్దరు చేతులు కలిపి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆరే అవకాశం ఇచ్చి తెలంగాణ కు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలనే 2 వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేయించారన్నారు. 2010 లో ఏర్పాటైన బ్రిజెష్ కుమార్ ట్రిబ్యూనల్ కృష్ణా జలాల కేటాయింపులు ఖరారు చేసిందన్నారు. అయితే (KWDT-1 : బచావత్ ట్రిబ్యూనల్) ప్రకారం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయించారని గుర్తు చేశారు. కానీ తీర్పు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉండటంతో బచావత్ ట్రిబ్యూనల్ ప్రకారమే అంటే 811 టీఎంసీలను వినియోగించుకుంటున్నామని తెలిపారు.
2014 ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ రెండు బోర్డులు APRA-2014 ప్రకారం రెండు రాష్ట్రాలు నదీ జలాలను తమ వాటా ప్రాకారం వాడుకునేలా పర్యవేక్షిస్తాయి. అయితే ఈ బోర్డుల పరిధి ఇంకా నోటిఫై కాలేదు.