బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాలికి గాయమైందని, అది ఎలా జరిగిందో తనకు తెలియదని.. ఇది కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ అంటుండగా ఇది యాక్సిడెంట్ అని ఎన్నికల కమిషన్ ప్రకటించిందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. కానీ గాయమైన కాలితోనే మీరు వీల్ చైర్ లో కోల్ కతా అంతా తిరుగుతున్నారు గానీ.. మీ రాష్ట్రంలో హింసకు గురై మరణించిన 130 మంది బీజేపీ కార్యకర్తల తల్లుల మానసిక క్షోభ గురించి మీరు పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. మమతపై దాడి ఉదంతంపై మొదటిసారిగా స్పందించిన ఆయన.. మా కార్యకర్తల గురించి కూడా ఆలోచించాలని ప్రార్థిస్తున్నా అన్నారు. సోమవారం పురూలియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని కోరుతున్నట్టు పేర్కొన్నారు. తను ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్లో ఏదో లోపం తలెత్తిందని, అందువల్ల ఆలస్యంగా వచ్చానని, కానీ దాన్ని ‘కుట్ర’ అనబోనని పేర్కొన్నారు.ఈ జిల్లాకు అనుకున్నసమయానికన్నా కాస్త ఆలస్యంగా వచ్చా.. ఇందుకు కారణం నేను ప్రయాణించిన హెలికాఫ్టర్ లో ఏదో సాంకేతిక లోపం తలెత్తడమే ‘ అంత మాత్రానా దీన్ని ‘కుట్ర’ అంటామా అని ఆయన ప్రశ్నించారు.
ఇదే జిల్లాలో మరో నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ.. ఓ సంఘటనలో తన కాలికి గాయమైందని, అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డానని, కాలికి బ్యాండేజీ ఉన్నందువల్ల నడవలేనని అంటూ.. ఈ నొప్పి కన్నా ప్రజలు అనుభవిస్తున్న నొప్పి ఎక్కువ గనుకే ఎన్నికల ప్రచారానికి వస్తున్నానని చెప్పారు. మొదట ఆ నొప్పిని తగ్గించాల్సి ఉందన్నారు. తాను తలచుకుంటే విశ్రాంతి తీసుకోవచ్చునని, కానీ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని ఆమె చెప్పారు. వీల్ చైర్ లోనే రాష్ట్రమంతా పర్యటిస్తానని అన్నారు. అటు- మమత తన ఎన్నికల అఫిడవిట్ లో కొన్ని కేసుల గురించి దాటవేశారని బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి ఆరోపించారు.
మరిన్ని ఇక్కడ చదవండి: ఏపీలో మత్తు దందా బట్టబయలు.. మామిడి తోటల మాటున గసగసాల సాగు.. కూపీ లాగుతున్న అధికారులు