పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరినట్లేనా..? బీజేపీ నాయకులను అందుకే కలుస్తున్నారా..? పార్టీ మారడం ఫిక్స్ అయ్యిందా..? అమరీందర్ వస్తే కమలం పార్టీకి కలిసి వస్తుందా..? ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతోందా..? కెప్టెన్ పార్టీ మారితే కాంగ్రెస్‌కు దారులు మూసుకున్నట్లేనా..? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు దేశ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో వినిపిస్తున్న ప్రశ్న. పంజాబ్‌లో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో తెలియదు కానీ.. దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు మాత్రం తెరలేసింది. అమరీందర్ సింగ్‌ను పక్కన పెట్టి.. ఆయన కుర్చీలో దళిత వర్గానికి చెందిన చరణ్ జీత్ సింగ్ చన్నీని కూర్చేబెట్టి సంబర పడిపోయింది హస్తం పార్టీ. ఎస్సీ వర్గాన్ని తమవైపు తిప్పుకుని రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లను తిప్పుకోవచ్చని కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసిందని చెప్పుకోవాలి. అయితే.. పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలను బట్టి ముఖ్యమంత్రి మార్పు ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి..
ఇదిలావుంటే.. అమరీందర్ సింగ్ అతి కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన అమరీందర్ సింగ్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు కాని రేపటిలోగా కెప్టెన్ బీజేపీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరతారని ఊహాగానాలొస్తున్నాయి. ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ అయిన అమరీందర్.. ఇవాళ జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమయ్యారు. దీంతో అమరీందర్ ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఇవాళ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, అమిత్ షాతో భేటీపై కెప్టెన్ క్లారిటీ ఇచ్చారు. సాగు చట్టాలపై చర్చించానని..వెంటనే చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరినట్టు ట్వీట్ చేశారు. కనీస మద్దతు ధరతో పాటు పంజాబ్‌లో పంట మార్పిడికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. అయితే కెప్టెన్ వర్గీయులు మాత్రమే ఇప్పటికే కమలం కండువలను రెడీ చేసుకుంటున్నట్లుగా పంజాబ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇవి కూడా చదవండి: Leopard Attack: చేతికర్రతో చిరుతను తరిమేసిన వృద్ధురాలు.. వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..
Bhadrachalam Temple: అసలేం జరుగుతోంది రామా.. నీ ప్రసాదం కూడా మాయం చేస్తున్నారే..