CM KCR Review on Corona : తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కోవిడ్ టెస్ట్‌లను భారీగా పెంచాలని నిర్ణయం
CM KCR Review on Corona Conditions : తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల
CM KCR Review on Corona Conditions : దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి, జాగ్రత్తలు పాటించాలని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోందన్నారు. కరోనా పరీక్షలను భారీ గాపెంచాలని అధికారులను ఆదేశించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వాక్సినేషన్ భారీగా చేయించాలన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మునిసిపల్ అడ్మినిస్టేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో ఫోన్‌లో మాట్లాడారు. వారి శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి నూరుశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు.
పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ చేపట్టడం కోసం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. కరోనా పరీక్షలను భారీగా పెంచేందుకు అన్ని జిల్లాలోను ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేయాలన్నారు. మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 45 సంవత్సరాల వారందరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతిరథోడ్, ఎమ్మెల్యేలు, సుదర్శన్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ రిజ్వి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, ఎండీ టీఎస్మెస్ ఐడీసీ చంద్రశేఖర్, వైద్యశాఖ సలహాదారు గంగాధర్ పాల్గొన్నారు.