AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu letter : రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా బాబు లేఖ, తెరపైకి ఎంపీల రాజీనామాలు.. ఓపెన్ ఛాలెంజ్‌లు..!

ఆంధ్రప్రదేశ్ ఎంపీల రాజీనామా అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మేం రాజీనామా చేస్తాం.. మీరు కూడా చేస్తారా? అంటూ వైసీపీ ఎంపీలకు సవాల్ విసురుతున్నారు..

Chandrababu letter : రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా బాబు లేఖ, తెరపైకి ఎంపీల రాజీనామాలు.. ఓపెన్ ఛాలెంజ్‌లు..!
Chandrababu
Venkata Narayana
|

Updated on: Jul 25, 2021 | 4:12 PM

Share

AP MP’s Resignations : ఆంధ్రప్రదేశ్ ఎంపీల రాజీనామా అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మేం రాజీనామా చేస్తాం.. మీరు కూడా చేస్తారా? అంటూ వైసీపీ ఎంపీలకు సవాల్ విసురుతున్నారు టీడీపీ ఎంపీలు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కుకర్మాగారాన్ని కాపాడుకునే ఉద్యమానికి వైసీపీ సారథ్యం వహిస్తే.. తక్షణమే రాజీనామాలకు సిద్ధమని పార్టీ అధినేత చంద్రబాబే ప్రకటించారు. ఈ మేరకు ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులకు స్వయంగా లేఖ కూడా రాసారాయన.

గతంలో ప్రత్యేక హోదా, పోలవరం కి నిధుల కేటాయింపు, రాజధాని మార్పు తదితర అంశాలపై అవకాశం వచ్చినప్పుడల్లా ఎంపీల రాజీనామాలకు డిమాండ్ చేసిన టీడీపీ ఈసారి స్టీల్ ప్లాంట్‌ను వేదికగా చేసుకుని తాజాగా డిమాండ్ చేస్తోంది. దీనిపై వైసీపీ కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. టీడీపీ రాజీనామాలు చేస్తామంటూ డ్రామాలు మాత్రమే అడుతుందని, చిత్త శుద్ధి ఉంటే వాళ్ళ ఎంపీల చేత రాజీనామా చేయించాలని ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీంతో రెండు పార్టీల సవాళ్లు – ప్రతిసవాళ్ళతో ఆసక్తి నెలకొంది.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ కి ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేసేందుకూ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వెనకాడరని ఆ లేఖలో చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్‌ సైతం కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని సూచించారు. పార్లమెంటు లోపల, బయట ఉద్యమానికి తెదేపా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

వాజపేయి హయాంలోనే కర్మాగారం ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చిందని, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, వ్యక్తిగతంగా తాను అభ్యర్థించడంతో కర్మాగారానికి రూ.1,333 కోట్లతో పునర్నిర్మాణ ప్యాకేజీ భారత ప్రభుత్వం ప్రకటించిందని చంద్రబాబు లేఖలో వివరిస్తూ, కర్మాగారాన్ని రక్షించేందుకు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇచ్చారు. అంతటితో ఆగలేదు. మనమంతా ఐక్యంగా పోరాడితేనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోగలమని అందుకోసం మేం రాజీనామాలకు సిద్ధం అంటూ తెగేసి చెప్పేసారు. ఇదే విషయాన్ని పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వివరించారు.

చంద్రబాబు రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ప్రైవేటీకరించేందుకు సిద్ధపడ్డప్పుడు ఉమ్మడి ఏపీ లోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఖండించండంతో నిర్ణయం ఆగిందన్నారు. ఇప్పుడు కూడా సీఎం జగన్ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తే బాగుంటుందని.. అప్పుడే కేంద్రానికి తీవ్రత తెలుస్తుందన్న వ్యాఖ్యలపై వైసీపీ కూడా తీవ్రంగానే స్పందించింది.

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అసలు టీడీపీ ప్రతీ అంశానికి రాజీనామా అంటూ ముందుకొస్తోందేతప్ప, అవి కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. ఏ రోజూ రాజీనామా పత్రాలు ఇవ్వడం కానీ, కనీసం అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదని, కేవలం ప్రజలను దృష్టి మల్లింప చేయడానికి మాత్రమే ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఓ వైపు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రాజీనామాలకు సిద్ధం అంటుంటే, మరోవైపు కేంద్రం మాత్రం వెనక్కు తగ్గేదే లే అంటోంది. ఇప్పటికే ప్రైవేటీకరణ నిర్ణయం పూర్తైందని.. ఆ విషయంలో ఇప్పుడు వెనుకడుగు వేయలేమని స్పష్టం చేస్తోంది. అయితే ఉద్యోగుల భద్రత, ఇతర విషయాలపై చర్చించేందుకు ఉంటే సమస్య లేకుండా పరిష్కరిస్తామని చెబుతోంది.. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఆంధ్రా దాటి.. దేశ రాజధానికి చేరింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రైవేటీకరణ ఆగడం అన్నది దాదాపు అసాధ్యమేనన్న వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.

Read also : Women Hulchal : పార్వతీపురంలోని ఒక లాడ్జిలో మకాం.. విజయనగరం జిల్లాలో గుజరాతీ మహిళల హల్ చల్