బెంగాల్ మొదటి దశ ఎన్నికల్లో 30 సీట్లలో 26 స్థానాలు మావే, హోం మంత్రి అమిత్ షా ధీమా
బెంగాల్ మొదటి దశలో 30 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 26 స్థానాలు తమవేనని హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు

బెంగాల్ మొదటి దశలో 30 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 26 స్థానాలు తమవేనని హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు .అస్సాంలో 47 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 37 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల ఓటర్లకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని, భారీ ఎత్తున ఓటింగ్ జరిగిందంటే ఈ ఎన్నికలపట్ల ప్రజల స్పందన ఎలా ఉందో తెలుస్తోందని ఆయన అన్నారు. బూత్ స్థాయి వర్కర్లు,పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన తరువాత బెంగాల్ లో 26, అస్సాంలో 37 స్థానాలలో బీజేపీ విజయం ఖాయమనే అభిప్రాయానికి నేను వచ్చాను అని అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్ లో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్ లో నిన్నఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని, ఎన్నో ఏళ్ళ తరువాత ఇలా ప్రశాంతంగా ఎన్నికలు జరగడం విశేషమని అమిత్ షా అన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారని, వారు బీజేపీకే పట్టం గట్టారని భావిస్తున్నానని ఆయన చెప్పారు. 200కి పైగా సీట్లలో విజయం సాధించి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని, వారు మార్పును కోరుతున్నారని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ సభలకు, ర్యాలీలకు జనం పెద్ద సంఖ్యలో రావడం శుభ సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని దశల ఎన్నికలు ఉన్నాయని, వాటి ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను, ప్రధాని మోదీ మరికొన్ని భారీ ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. కాగా-నిన్న బెంగాల్ లో ఇద్దరు బీజేపీ నేతల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలు ఎలా లీక్ అయ్యాయని ఆయన ప్రశ్నించారు. పార్టీ నేత శిశిర్ బజోరియా, ట్రబుల్ షూటర్ ముకుల్ రాయ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను టీఎంసీ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కి ఎవరు పాల్పడ్డారని అమిత్ షా ప్రశ్నించారు.
మరిన్ని ఇక్కడ చదవండి: హొలీ పండుగ వచ్చేసింది., ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకొండి, ఢిల్లీ వాసులకు సీఎం కేజ్రీవాల్ సూచన
Holi 2021: హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? రంగుల వేడుక ప్రాముఖ్యత.. పురాణాల ప్రకారం..



