తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై మూడు రోజులు గడుస్తున్నా తుది ఫలితం తేలలేదు. దీంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో సహా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్లగొండ– ఖమ్మం– వరంగల్ స్థానంలో శనివారం మధ్యాహ్నం వరకు, హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ స్థానంలో శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు
అయితే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనూ పూర్తయిన తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ముగ్గురు అభ్యర్థుల నడుమ చివరి వరకు గెలుపు దోబూచులాడే అవకాశముందని స్పష్టమవుతోంది. రెండు స్థానాల్లోనూ శనివారం రాత్రికి తుది ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నిక చెల్లుబాటయ్యే ఓట్లలో 50% + ఒక ఓటును పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఏడురౌండ్లలో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా… ఏ అభ్యర్థీ 50% ఓట్లు సాధించలేకపోయారు. అంటే అభ్యర్థి విజయానికి కావాల్సిన నిర్ణీత కోటా ఓట్లు సాధించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు.
అతితక్కువ ఓట్లు సాధించిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ వస్తున్నారు. అలా కింది నుంచి పైకి వెళుతూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నారు. వారి బ్యాలెట్‌లో ద్వితీయ ప్రాధాన్యత ఓటును లెక్కించి ఇతరులకు కలిపే ప్రక్రియ ఎలిమినేషన్ విధానం కొనసాగుతోంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తొలి, రెండవ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయింది. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో స్పష్టత రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు.
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎస్.వాణీదేవి(టీఆర్‌ఎస్) ఒకటో, ఎన్.రామచందర్‌రావు (బీజేపీ) రెండో స్థానంలో నిలిచారు. దీంతో చివరి నిముషం వరకు ఈ ఇద్దరి నడుమ ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశముంది. ఇక, మూడో స్థానంలో నిలిచిన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (స్వతంత్ర), నాలుగో స్థానంలో నిలిచిన జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్) బ్యాలెట్లలో వచ్చే రెండో ప్రాధాన్యత ఓట్లపై వాణీదేవి, రాంచందర్‌రావు గెలుపోటములు ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో చిన్నారెడ్డి, నాగేశ్వర్‌లు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే వారి బ్యాలెట్‌లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వాణీదేవి, రామచందర్‌రావు నడుమ ఎవరికి ఎక్కువగా వెళితే వారు విజేత అయ్యే అవకాశముంది. విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు రావాలంటే వాణీదేవి మరో 17.57 శాతం, రాంచందర్‌రావు మరో 19 శాతం ఓట్లు సాధించాల్సి ఉంది.
ఇక నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు ఇద్దరికీ కలిసి 25.26 శాతం తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, స్వతంత్ర అభ్యర్థులు జి.హర్షవర్దన్‌రెడ్డి, అన్వర్‌ఖాన్, వేముల తిరుమల బ్యాలెట్లలో వచ్చే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కూడా కొంత మేర వాణీదేవి, రాంచందర్‌రావుకు కీలకం కానున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిశాక 37 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. ఈ నియోజకవర్గ పరిధిలో 93 అభ్యర్థులు పోటీ చేశారు.
మొదటి, రెండో ప్రాధాన్యతా ఓట్ల ఫలితాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి లక్షా 12 వేల 829 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావుకు లక్షా 4 వేల 796 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ 53 వేల 610 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31 వేల 695 ఓట్లు వచ్చాయి. తొలి రెండు ప్రాధాన్యతా ఓట్లలో టిఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి 8,028 ఓట్ల ఆధిక్యం సాధించారు. గెలుపు కోసం మొత్తం లక్షా 68 వేల 521 ఓట్లు రావాల్సి ఉంది.
తొలి రెండు ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ అభ్యర్థికి 8 వేల మెజార్టీ మాత్రమే ఉందని, ఇది పెద్ద మెజార్టీ కాదంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు. తర్వాత జరిగే ప్రాధాన్యతా ఓట్లలో తనకు అధికంగా ఓట్లు వస్తాయని, తానే గెలుపొందుతాననే నమ్మకం ఉందంటున్నారు.
Read More:
Temple Corona: అర్చకులకు సోకిన కరోనా.. తెలంగాణ చిన్న తిరుపతి 15 రోజులు మూసివేత
MLC Elections Counting Live: