కరోనా వైరస్‌తో బీజేపీ ఎంపీ మృతి.. నందకుమార్ లేని లోటు తీరనిది అంటూ ప్రధాని మోదీ ట్వీట్
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ఓవైపు దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుస్తోంది. నిన్నటి నుంచి 60ఏళ్లు దాటిన వారికీ, దీర్ఘ కాలిక..
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ఓవైపు దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుస్తోంది. నిన్నటి నుంచి 60ఏళ్లు దాటిన వారికీ, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. అయినప్పటికీ కరోనా మహమ్మారి బారిన పడి మరో బీజేపీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ కరోనా వైరస్ సోకి తుదిశ్వాస విడిచారు. నందకుమార్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు.
నందకుమార్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అంటూ ట్వీట్ చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. అటు నందకుమార్ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ , తమనేత అకాలమరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2009-14మధ్య ఐదేళ్ల కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.
మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి:
అయితే కరోనా మహమ్మారి ఏడాదిగా తీవ్ర స్థాయిలో విజృంచి దేశంలో తాజాగా తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగించే అంశమని భావించినా.. కొన్ని రాష్ట్రాల్లో తగ్గినట్లే తగ్గి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి తీవ్ర స్థాయిలో కృషి చేసిన అధికారులకు మళ్లీ తలనోప్పులు మొదలయ్యాయి. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తదితర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక గుజరాత్ రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుజరాత్ రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో కరోనా కట్టడికి విధించిన రాత్రి సమయంలో కర్ఫ్యూను 15 రోజుల పాటు పొడిగించారు.
కరోనా కట్టడికి అహ్మదబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్ నగరాల్లో శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు మున్సిపల్ నగరాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున రాత్రి సమయంలో కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. కర్ఫ్యూ ఉదయం 6 గంటల వరకు విధించారు. కరోనా నిరోధానికి వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగిస్తూనే రాత్రి సమయంలో కర్ఫ్యూను విధించారు.
గుజరాత్ రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ కార్మికుల్లో 77 శాతం మందికి వ్యాక్సిన్ అందించారు. . అయితే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్కులు ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు.
సరిగ్గా ఏడాది క్రితం మహమ్మారి ఎంట్రీ:
డేంజర్ బెల్స్ మోగింది సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు… మాయదారి కరోనా వైరస్ జాడ తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న ఓ యువకుడికి వైరస్ సోకినట్టు మొదట గుర్తించారు. అప్పటి నుంచి కరోనా ప్రజలను గడగడలాడించింది. నాలుగు గోడల మధ్యకు పరిమితం చేసింది. సమాజ జీవులను కాస్త ఏకాంత జీవులను మార్చేసింది. వేరే వారితో మాట్లాడాలన్న భయం.. అంతా దారుణంగా మారిపోయింది. జీవితాలను తలకిందులు చేసి ఆడుకుంది. తుమ్మినా, దగ్గినా వెన్నులో వణుకు.. సొంతవారు, ఆప్తులనైనా ప్రేమగా దగ్గరికి చేరి పలకరించలేని పరిస్థితి.. చివరకు కాటికి కూడా అనాథలా తరలిపోవాల్సి న దీనస్థితి.. ఇవీ మానవాళికి కరోనా రక్కసి మిగిల్చిన మరకలు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ … తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా ఏడాది గడిచింది. ఇదే రోజు ఓ యువకుడికి వైరస్ సోకడం… రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరోజు మొదలు.. కోవిడ్ వైరస్ రాష్ట్రంలో ప్రతిమూలకు వెళ్లింది. చిన్నా పెద్దా.., ముసలి ముతకా అనే తేడాలేం లేకుండా అందరినీ పీడించింది. ఉన్నోళ్లు.. లేనోళ్లు అని తేడాల లేకుండా అందిరిని కుదేలుచేసింది.
ముందు జాగ్రత్తలతోనే వైరస్ కట్టడి:
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం… ముందస్తు జాగ్రత్తలే అంటూ.. ప్రజలకు అవగాహన కల్పించిన ఆరోగ్య శాఖ.. మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే… మన దగ్గర కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంటూ వచ్చింది. మహమ్మారిపై పోరు చేస్తున్న తరుణంలోనే తెలంగాణ గడ్డమీద టీకా ఆవిష్కరణ జరిగింది. ఇప్పటికే మూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా… రెండో విడత వ్యాక్సినేషన్ సైతం ప్రారంభమైంది. ఇప్పటివరకు కట్టడిలోనే ఉన్న వైరస్ వ్యాప్తి… మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో… ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Saddened by the demise of Lok Sabha MP from Khandwa Shri Nandkumar Singh Chauhan Ji. He will be remembered for his contributions to Parliamentary proceedings, organisational skills and efforts to strengthen the BJP across Madhya Pradesh. Condolences to his family. Om Shanti.
— Narendra Modi (@narendramodi) March 2, 2021
Read more:
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో తెలంగాణ హోంమంత్రి.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన మహమూద్ అలీ