ఢాకా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 600 కేజీల మామిడి కాయలు బహుమతిగా పొందారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం (జూన్ 12) మమతాకు మామిడి పండ్లు గిఫ్ట్‌గా పంపినట్లు అధికారులు తెలిపారు.’హింసాగర్’, ‘లాంగ్రా’, ‘లక్ష్మణ్ భోగ్’, ‘ఫాజిల్’ వంటి పలు రకాల మామిడి పండ్లను అందంగా అలంకరించిన బుట్టలో మమతాకు పంపారు. గతేడాది కూడా మామిడి పండ్ల సీజన్‌లో ఇదే విధంగా బంగ్లా ప్రధాని మామిడి పండ్లను పంపినట్లు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్‌కు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. కేవలం మమతా బెనర్జీకి మత్రమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ బంగ్లా ప్రధాన మంత్రి మామిడి పండ్లను పంపినట్లు సమాచారం.
కాగా హసీనా పొరుగు దేశాల అధికారులకు మామిడి పండ్లను బహుకరించడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం ముఖ్యమంత్రులకు, రాష్ట్రపతి ముర్ముకు ఆమె మామిడి పండ్లను బహుమతిగా పంపారు. నిజానికి 2011లో పీఎం హసీనా రాజకీయ నేతలకు మామిడి పండ్లను పంపుతున్నారు. ఇక అప్పటి నుంచి రాజకీయ పరంగా ఎన్ని ఉన్నా.. వాటన్నింటినీ పక్కన పెట్టి యేటా తమ దేశంలో దొరికే మేలైన మామిడి పండ్ల రకాలను ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులకు పంపడం ఆనవాయిగా పెట్టుకున్నారు. ఈ మామిడి పండ్ల రాజకీయం వెనుక మతలబుపై లోగడ ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ పొరుగు దేశాలతో సత్సంబంధాలు మాత్రం దెబ్బతినకూడదని పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.