ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ బ్రో సినిమాలోని ఓ సన్నివేశంపై వివాదం నడుస్తోంది. మంత్రి అంబటి రాంబాబు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు డ్యాన్స్ చేయగా.. అచ్చం అలా డ్యాన్స్ వేసే సన్నివేశం బ్రో సినిమాలో రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ సినిమా ప్రొడ్యుసర్లపై విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ఈ క్రమంలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు. ఆంబోతు అంటూ కామెంట్ కూడా చేశారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలకై అంబటి స్పందించారు. చంద్రబాబు నాయుడు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బాబు జీవితమంతా ఆంబోతులకు ఆవులను సప్లే చేయడమే అంటూ మండిపడ్డారు. రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. బాబు హాయంలో ఆరిన ప్రాజెక్టులన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేశారని తెలిపారు.
చంద్రబాబు నాయుడుకి శంకుస్థాపనలు చేయడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయడం తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం గురించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. నదుల అనుసంధానంతో ఏం సాధించారంటూ అంబటి నిలదీశారు. పొలవరం, పులిచింతల ప్రాజెక్టులను తానే ప్రారంభించానని చెబుతున్న చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. పైగా నన్ను ఆంబోతు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే చంద్రబాబుకు ఎందుకుంత కోపం అంటూ ప్రశ్నించారు. రాముడిని అంటే భీముడికి కోపమచ్చినట్లు చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు. బ్రో సినిమా గురించి తాను మాట్లాడితే ఇందులో చంద్రబాబుకు ఏంటి సంబంధం అని అన్నారు. లై డిటెక్టర్‌కు కూడా దొరకని అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు.