- Telugu News Photo Gallery Woman farmer Success Story: earning profit in lakhs on cultivation of marigolds with investment in thousands
Success Story: బంతి పూల సాగు.. వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు.. ఓ మహిళ రైతు నయా ఐడియా
పార్వతీపురం మన్యం జిల్లా గొట్టివలసలో ఓ మహిళ వినూత్న ఆలోచనలతో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో సిరులు పండిస్తున్నారు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడి, తక్కువ నీరు అనే ఫార్ములాతో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. పట్టువర్ధనం షర్మిళ అనే మహిళ వృత్తి రీత్యా న్యాయవాది. షర్మిళ తండ్రి వ్యవసాయదారుడు కావడంతో చిన్నతనం నుండి అదే వ్యవసాయం పై మక్కువ పెంచుకుంది.
G Koteswara Rao | Edited By: Surya Kala
Updated on: Nov 06, 2023 | 12:37 PM

షర్మిళ తండ్రి చేస్తున్న వ్యవసాయం చూసి మెలకువలు కూడా నేర్చుకుంది. తన భూమి ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో వాణిజ్య పంటలకే ఈమె ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ముందుగా తన భూమి అంతా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి అందులో పామాయిల్ తోట సాగు చేశారు. తరువాత ఆ తోటలో అంతర్ పంటలుగా పలు రకాల పంటలు వేయటం ప్రారంభించారు. అంతర్ పంటలను సీజన్ కు తగ్గట్టుగా తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు పరిశోధించి ఆ తరహాలో సాగు చేస్తుండేది.

అందులో భాగంగా ప్రస్తుతం కార్తీకమాసంను దృష్టిలో ఉంచుకొని బంతిపూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని గ్రహించారు. అందులోనూ బంతి పూల సాగు కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. దీంతో లోకల్ బంతి పూలు కాకుండా నీటి ఎద్దడికి తట్టుకుంటూనే పరిమాణంలో పెద్దదిగా ఉండే కలకత్తా జాతి బంతిపూల తోటను సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కలకత్తా నుండి బంతిపూల విత్తనాలను తెప్పించి నారును నేరుగా పొలంలో కాకుండా నర్సరీ లో పెంచారు.

ఒక ఎకరం బంతిపూల సాగుకు సుమారు ఎనిమిది వేల మొక్కలు వరకు అవసరం. అలా నర్సరీలో పెంచిన ఎనిమిది వేల మొక్కలను తెగుళ్లు, పురుగు బెడద లేకుండా మొక్కకి మొక్కకి మధ్య కొంత దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

అంతేకాకుండా బంతి మొక్కల పెంపకానికి పూర్తిగా సేంద్రియ పద్దతినే అవలంభించారు. మొక్కల పోషకానికి ఎరువు, ఆవు మూత్రాన్ని మాత్రమే వాడారు. అలా అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని పెంచిన ముప్పై రోజుల తరువాత బంతిపూల దిగుబడి ప్రారంభమైంది.

కలకత్తా రకం బంతిపూలు కావడంతో ఒక్కో పువ్వు దాదాపు అరకేజి బరువుతో చాలా పెద్దదిగా పూసింది. అలా ఒక్కో మొక్కకి సుమారు 15 వరకు పూలు పూశాయి. పూసిన ఒక్కో బంతి పువ్వును రూపాయిన్నర ధరకు విక్రయిస్తున్నారు.

మొత్తం ఎకరంలో వేసిన ఎనిమిది వేల మొక్కలకు దాదాపు లక్షా ముప్పై వేల పూల దిగుబడి రాగా వాటిని రుపాయిన్నర చొప్పున విక్రయిస్తే లక్షా ఎనభై వేల రూపాయలు చేతికి అందాయి. విత్తనం వేసిన దగ్గర నుండి పూలు విక్రయించే వరకు ఎకరానికి సుమారు యాభై వేల రూపాయల ఖర్చు అయినట్లు చెప్తున్నారు మహిళ రైతు షర్మిళ.

అయితే నీటి ఎద్దడి ఉన్నా ఈ మొక్క తట్టుకోగలగ బంతి పూల సాగు లాభసాటి గా మారి ఎకరం భూమిలో కేవలం యాభై వేల పెట్టుబడితో లక్షా ముప్పై వేల వరకు ఆదాయం పొందానని చెప్తున్నారు. రైతులు అదును, పదును చూసి సీజన్స్ తగ్గ వాణిజ్య పంటలు వేసుకుంటే సిరులు కురిపించవచ్చని చెప్తున్నారు.





























